అజారుద్దీన్ మంత్రి పదవి మూడు నెలలే !
ముఖ్యంగా దీని మీద మాట్లాడుతున్నది తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే అజారుద్దీన్ మంత్రి పదవి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.;
తెలంగాణాలో రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా మంత్రిగా చేరిన అజారుద్దీన్ రాజీనామాకు గడువు దగ్గర పడిందా, ఆయన జస్ట్ ఆరు నెలలలోనే తమ మినిస్టర్ ముచ్చటను తీర్చుకుని మాజీ మంత్రి ట్యాగ్ తగిలించుకోవాల్సిందేనా అంటే అవును అని అంటున్నారు. ముఖ్యంగా దీని మీద మాట్లాడుతున్నది తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే అజారుద్దీన్ మంత్రి పదవి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన పదవి పోతుందంటూ :
అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. అయితే ఆయన ఈ రోజుకీ ఏ చట్ట సభలో సభ్యుడు కారు, రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవిలో కొనసాగాలీ అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి తీరాలి. కానీ ఇప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కానీ అవకాశం ఇవ్వడం కానీ చేయలేదు. దాంతో అజారుద్దీన్ మంత్రి పదవి మూణ్ణాళ్ళ ముచ్చటే అని హరీష్ రావు అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని అందువల్ల మరో మూడు నెలలలో ఎమ్మెల్సీ కాకపోతే తప్పకుండా మంత్రి పదవి పోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పుణ్యమే :
ఇక అజారుద్దీన్ మంత్రి పదవి కూడా కేసీఆర్ పుణ్యమే అని హరీష్ రావు మరో మాట అన్నారు. తాము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగా ప్రశ్నించినందువల్లనే అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కిందని చెప్పుకొచ్చారు. అందువల్ల కేసీఅర్ ఫోటోకు అజారుద్దీన్ దండం పెట్టుకోవాలని హరీష్ రావు సెటైర్లు వేశారు.
అన్నంత పనీ జరిగేనా :
తెలంగాణాలో ఎమ్మెల్సీ పదవులు అయితే ప్రస్తుతానికి ఖాళీ లేవు అని అంటున్నారు. దాంతో అజారుద్దీన్ ని ఏ విధంగా నామినేట్ చేస్తారు అన్నది చర్చగా ఉంది. నామినేట్ చేయకపోతే కనుక కచ్చితంగా హరీష్ రావు చెప్పినట్లుగానే అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ పెద్దలు ఏ ఆలోచనలో ఉన్నారో అన్నది చూడాలని అంటున్నారు.
హరిక్రిష్ణ ఉదాహరణ :
ఇది ఇప్పటి ముచ్చట కాదు, మూడు దశాబ్దాల క్రితం కూడా జరిగింది. 1995 సెప్టెంబర్ 1న బాబు సీఎం గా ప్రమాణం చేస్తూ రవాణా శాఖ మంత్రిగా హరిక్రిష్ణను తీసుకున్నారు. అప్పటికి ఏ సభలోనూ హరిక్రిష్ణ సభ్యుడు కాదు, ఆరు నెలలలో ఆయన నెగ్గాల్సి ఉంది. హిందూపురంలో ఉప ఎన్నిక ఆ తరువాత వచ్చింది. ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. ఇక ఎమ్మెల్సీ ఉన్నా హరిని నామినేట్ చేయలేదు, దాంతో ఆయన పదవీ కాలం 1996 ఫిబ్రవరిలో ముగుస్తుంది అనగా ముందుగానే రాజీనామా చేశారు. అయితే ఆయన హిందూపురం ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు కానీ తిరిగి మంత్రిగా తీసుకోలేదు, అది ఉమ్మడి ఏపీలో ఉన్న ఉదాహరణ. మరి రాజకీయ అవసరాల కోసం మంత్రిగా ముందు చేసినా ఆ తరువాత ఉభయ సభలలో ఎక్కడో ఒక చోట చోటు కల్పించకపోతే జరిగేది ఇదే అని అంటున్నారు.