ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల ఆధారాలు సేఫ్
నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారానికి ఎఫ్‌ఎస్‌ఎల్ డీజీ శిఖా గోయల్ తెరదించారు.;
నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారానికి ఎఫ్‌ఎస్‌ఎల్ డీజీ శిఖా గోయల్ తెరదించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక కేసుల ఆధారాలు కాలి బూడిదయ్యాయన్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆదివారం ప్రమాద స్థలిని పరిశీలించిన ఆమె, రికార్డుల భద్రతపై మీడియాకు పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు.
ఓటుకు నోటు: ఎప్పుడో కోర్టుకు అప్పగించాం
2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైళ్లు ప్రస్తుతం ల్యాబ్‌లోనే లేవని శిఖా గోయల్ స్పష్టం చేశారు. "ఈ కేసులో 2015లో రెండు విడతలుగా మాకు 16 మెటీరియల్ ఆబ్జెక్టులు అందాయి. వాటిపై ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి చేసి, అదే ఏడాది నివేదికలతో సహా అన్ని ఆధారాలను ఏసీబీ కోర్టుకు తిరిగి ఇచ్చేశాం. ప్రస్తుతం ఆ వస్తువులన్నీ కోర్టు భద్రతలోనే ఉన్నాయి. ఇక్కడ లేని వస్తువులు కాలిపోయే ప్రసక్తే లేదు" అని ఆమె తేల్చి చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్: డేటా రికవరీ సాధ్యమే!
ఇక ఇటీవల సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై వస్తున్న ఆరోపణలను కూడా ఆమె కొట్టిపారేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 136 మెటీరియల్స్ ల్యాబ్‌కు వచ్చాయని, అందులో 129 అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపారు. కేవలం 7 మెటీరియల్స్ మాత్రమే మంటల వల్ల స్వల్పంగా దెబ్బతిన్నాయని, అయితే వాటిలోని డేటాను తిరిగి వెలికితీసే సాంకేతికత అందుబాటులో ఉందని.. ఆధారాలు పూర్తిగా పోలేదని ఆమె భరోసా ఇచ్చారు. ఇప్పటికే మెజారిటీ నివేదికలను దర్యాప్తు అధికారులకు అందజేసినట్లు వెల్లడించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే దర్యాప్తు
శనివారం ఉదయం 10:08 గంటలకు ప్రాపర్టీ రూమ్‌లో పొగ రావడాన్ని సిబ్బంది గుర్తించారని, కొద్దిసేపటికే మంటలు లైబ్రరీ, హెచ్‌ఆర్‌డీ గదులకు వ్యాపించాయని డీజీ వివరించారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ల్యాబ్‌లో ఎవరున్నారు? మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలేంటి? అనే అంశాలపై స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఆస్తినష్టంపై అంచనా వేస్తున్నామని, త్వరలోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
వదంతులకు చెక్
ముఖ్యమైన ఆధారాలను ధ్వంసం చేసేందుకే ఈ అగ్నిప్రమాదం జరిగిందంటూ వస్తున్న రాజకీయ విమర్శలకు డీజీ వివరణతో బ్రేక్ పడింది. కీలకమైన సాక్ష్యాధారాలన్నీ డిజిటల్ రూపంలోనూ, మరికొన్ని భద్రమైన స్టోరేజ్ ఏరియాల్లోనూ ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.