వైసీపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ?
అనకాపల్లి జిల్లాలో సీనియర్ నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు సొంత అనుచర బలం దండీగా ఉన్న నేతగా గుర్తింపు కలిగిన కన్నబాబురాజు వైసీపీకి దూరం అయినట్లేనా అంటే సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి అని అంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో సీనియర్ నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు సొంత అనుచర బలం దండీగా ఉన్న నేతగా గుర్తింపు కలిగిన కన్నబాబురాజు వైసీపీకి దూరం అయినట్లేనా అంటే సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి అని అంటున్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూడా వైసీపీ నేతల హడావుడి లేదు. ఆ మాటకు వస్తే గత రెండేళ్ళుగా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. ఆయన రాజకీయ వ్యూహంలో అది భాగం అని అంటున్న వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నబాబురాజు తాజాగా వైసీపీకి ఒక భారీ షాక్ ఇచ్చారని అని చెప్పుకుంటున్నారు.
దూరంగానే ఉంటూ :
తన సొంత నియోజకవర్గం ఎలమంచిలిలో వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి భారీ ఎత్తున నాయకులు అంతా తరలివచ్చి నిర్వహించిన చలో పంచదార్ల కార్యక్రమంలో ఎక్కడా మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. రాంబిల్లి మండలంలోని పంచదార్లలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర నేతలు అంతా పాల్గొన్నారు. అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నబాబు మాత్రం కనిపించకపోవడం తో ఆయన దూరం అయినట్లేనా అన్న చర్చకు తెర లేచింది.
అప్పటి నుంచే అలా :
వైసీపీ తరఫున 2019లో టికెట్ అందుకుని గెలిచిన కన్నబాబు రాజు 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత కొంతకాలం పాటు ఆయననే నియోజకవర్గం ఇంచార్జిగా పార్టీ నియమించింది. కానీ ఆయన పెద్దగా యాక్టివిటీస్ చేయడం లేదని భావించడమే కాదు సామాజిక సమీకరణ కోణం నుంచి కూడా ఆలోచన చేసి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఆ బాధ్యతలను పార్టీ కట్టబెట్టింది. దాంతో కన్నబాబు రాజు తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని ప్రచారం సాగింది. నాటి నుంచే ఆయనకు వైసీపీకి మధ్య గ్యాప్ ఏర్పడింది అని చెబుతున్నారు.
భవిష్యత్తు సమాలోచనలతో :
ఇదిలా ఉంటే ఆయన వైసీపీలో టెక్నికల్ గానే ఉంటున్నట్లుగా ఉంది తప్ప లేరనే అంటున్న వారూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ అయిన సుకుమార్ వర్మకు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతాయని ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయని అంటున్న నేపధ్యంలో ఆయన ఆచీ తూచీ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే రాజు గారి డెసిషన్స్ ఉంటాయని చెబుతున్నారు. వైసీపీలో అయితే ఆయన కొనసాగేది ఉండదని అంటున్నారు.
వర్గ పోరుతోనే :
ఇక ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీకి కన్నబాబురాజు వర్గం సహకారాలు అందించడం లేదు. అలాగే మరో వర్గం కూడా పార్టీలో ఉంది. అలా వైసీపీలో రెండు వర్గాలు అక్కడ పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే ఈ విధంగా పోరు సాగుతోందని అంటున్నారు. కాపులు గవరలు ఎక్కువగా ఉన్న ఎలమంచిలిలో వైసీపీ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీ పడుతూ పార్టీ పరంగా రెండుగానే వ్యవహరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.