వైసీపీకి సిక్కోలు చీకాకులు...వరసబెట్టి మరీ !

శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోటగా చెబుతారు. అక్కడ 2019 ఎన్నికలు తప్పించి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ మంచి స్థానాలే దక్కించుకుంది.

Update: 2026-07-22 05:30 GMT

శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోటగా చెబుతారు. అక్కడ 2019 ఎన్నికలు తప్పించి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ మంచి స్థానాలే దక్కించుకుంది. 2024లో అయితే ఏకంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది సీట్లు టీడీపీ కూటమిగా సాధించి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక వైసీపీకి 2019లో వచ్చిన ఆ అపరిమితమైన విజయాన్ని కాపాడుకోవడంలో విఫలం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. పార్టీలో వర్గ పోరుతో పాటు సరైన దిశా నిర్దేశం చేసి జిల్లా పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం లేకపోవడం కూడా లోటుగా చెబుతున్నారు. వైసీపీకి సామాజిక సమీకరణలు కూడా ఇబ్బంది పెడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీలో కీలక నేతలు అన్న వారు ఒక్కొక్కరుగా చిక్కుల్లో చిక్కుకుంటూ పోవడం పార్టీకి కలవరం కలిగిస్తోంది అని అంటున్నారు.

మాజీ స్పీకర్ మీద :

ఇక తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే ఆయన మాజీ మంత్రిగా మాజీ స్పీకర్ గా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా పేరు గడించారు. అలాంటి ఆయన మీద భూకబ్జా కేసు ఫైల్ అయింది. రూ. 4 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఆయన పేరు ఉంది. బతికున్న భూ యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు స్పష్టించారని ఆపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తమ్మినేని కుటుంబం ఆముదాలవలస నుంచి వేరే చోటకు వెళ్ళిపోయింది అని ప్రచారం సాగుతోంది. అరెస్టు భయంతోనే సొంత కార్లను సైతం వదిలేసి వేరే ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయారని అంటున్నారు. పోలీసులు లోకేషన్ ని ట్రాక్ చేయకుండా ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళినట్లుగా చెబుతున్నారు.

పార్టీలో కీలకంగా :

శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచాజిగా తమ్మినేని సీతారాం ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన కుమారుడి తమ్మినేని చిరంజీవి నాగ్ ని కూడా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో పాత కేసు ఇలా చుట్టుముట్టి తిరుగులేని విధంగా ఉచ్చు బిగుసుకోవడంతో తమ్మినేని కుటుంబానికి రాజకీయంగా అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

కష్టాలు అలా:

వైసీపీకి 2024 తరువాత పార్టీ పరంగా ఎత్తిగిల్లడానికి అవకాశాలు లేకుండా వరసబెట్టి కష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా టెక్కలి నుంచి కీలక నాయకుడు ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత విషయాల మీద ఇబ్బందులు పడడంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన బలమైన నాయకుడే కానీ ఈ విధంగా దూరం కావడం టెక్కలిలో వైసీపీకి లోటుగా చెబుతున్నారు పలాసలో నిన్నటికి నిన్న మాజీ మంత్రి సీదరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ ఇష్యూలో ఆహ్యన ఇబ్బందులలో పడ్డారు. అరెస్టు కావచ్చు అన్న దాకా ప్రచారం సాగింది. ఇలా చూసుకుంటే సీనియర్ నాయకులు అంతా తలో విధంగా సమస్యలలో సతమతమవుతూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో పడుతున్నారు అని అంటున్నారు. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. మరి కొద్ది నెలలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ 2024 లో ఓటమి తరువాత పెద్దగా కోలుకోకపోతే ఇబ్బందే అని అంటున్నారు.

Tags:    

Similar News