బ్యాలెట్ తోనే లోకల్ ఫైట్
స్థానిక సంస్థలకు బ్యాలెట్ పేపర్లే ఎపుడూ ఉపయోగిస్తూంటారు. అయితే ఈసారి ఈవీఎంలను ఉపయోగించాలని మొదట నిర్ణయించారు.
ఈవీఎంల మీద విపరీతమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది ప్రతిపక్షం. గెలిస్తే అవి ఓకే. ఓడితే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అని పడికట్టు విమర్శలు చేస్తూ ఉంటారు. దాంతో బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూంటారు. ఏపీ ఎన్నికల సంఘం అయితే బ్యాలెట్ తోనే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది. దాంతో ఈవీఎంల ప్లేస్ లో బ్యాలెట్ పత్రాలే ఈసారి కనిపించబోతున్నాయి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఉపయోగించడానికి సరిపడనన్ని ఈవీఎంలు లేకపోవడం వల్లనే అని అంటున్నారు.
ఈవీఎంలు ఉపయోగించాలని :
స్థానిక సంస్థలకు బ్యాలెట్ పేపర్లే ఎపుడూ ఉపయోగిస్తూంటారు. అయితే ఈసారి ఈవీఎంలను ఉపయోగించాలని మొదట నిర్ణయించారు. దాంతో అవసరమైన ఈవీఎంల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా రప్పించాలని అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో చివరికి బ్యాలెట్ పేపర్ల అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వంటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
బ్యాలెట్ పేపర్ అయితే :
నిజానికి ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూడా ప్రజాభిప్రాయం ఎలా ఉంటే అలాగే ప్రతిబింబిస్తుంది. ఈ మధ్యనే కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను బ్యాలెట్ పేపర్ మీదనే నిర్వహించారు. అయినా ఫలితం అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వచ్చింది. ఈవీఎంలు అయితే ట్యాంపరింగ్ అన్న విమర్శలు చేసే వారు కూడా బ్యాలెట్ పేపర్ కావడంతో ఎవరూ దీని మీద చేయలేకపోయారు. దాంతో ఇపుడు కూడా బ్యాలెట్ పేపర్ వినియోగమే చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ప్రజా తీర్పు స్పష్టం :
ఏ సాధనం అయినా ఓటు అనేది జనాలు వేస్తారు, కాబట్టి ప్రజా తీర్పు స్పష్టంగా ఉంటుందనే మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే కొంత వ్యక్తిగతంగా తీసుకునే చాన్స్ ఉంటుంది. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్వేచ్చాయుతమైన వాతావరణంలో నిర్వహించాలని అంతా కోరుతున్నారు. అదే విధంగా సున్నితమైన ప్రాంతాలు వివాదాలు గొడవలు చోటు చేసుకుంటాయి అన్న చోట గట్టిగా బందోబస్తు ఉండాలని కూడా అంటున్నారు. ఇక బ్యాలెట్ పేపర్ వల్ల ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుంది అని కూడా ఉంది. అయితే ట్రెండ్ అన్నది తెలిసిపోతుంది కాబట్టి ఉత్కంఠ ఉన్నా ఇబ్బంది అయితే లేదని అంటున్నారు. మొత్తానికి బ్యాలెట్ పేపర్ వినియోగం అన్ని రాజకీయ పక్షాలకు అంగీకారమే అవుతుందని అంటున్నారు. ఇక్కడ కూడా సవ్యంగా ఎన్నికలు జరగలేదు అని అంటే మాత్రం ఆలోచించాల్సిందే మరి.