జగన్ స్థానిక ప్రచారం ?
స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల కంటే పెరిగిన తమ బలాన్ని చాటాలని అనుకుంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల కంటే పెరిగిన తమ బలాన్ని చాటాలని అనుకుంటోంది. అంతే కాదు కూటమి రెండేళ్లకు పైగా సాగిన పాలనలో ప్రజా వ్యతిరేకత గణనీయంగా ఉందని వైసీపీ నమ్ముతోంది. దాంతో తమ పార్టీకి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే జగన్ కూడా మొత్తం 175 అసెంబ్లీ ఇంచార్జిలకు గట్టిగానే చెబుతున్నారు. ఎక్కడా ఏకగ్రీవాలు వద్దు అని కూడా స్పష్టం చేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందని కూడా వారికి తెలియజేస్తూ సరైన వ్యూహాలతో అంతా కలిసి సమిష్టిగా పోరాడితే వైసీపీకి మంచి ఫలితాలు వస్తాయని కూడా అంటున్నారు.
సీట్ల సర్దుబాటు మీదనే :
కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనుకున్నంత ఈజీ కాదని వైసీపీ భావిస్తోంది. అంతే కాకుండా లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి దిగువ స్థాయిలో నాయకులు తమకు బలం ఉందనుకుంటే పార్టీని పక్కన పెట్టి మరీ రెబెల్స్ గా పోటీ చేయవచ్చు అని అంటున్నారు. అలా కూటమిలో పార్టీలకు పనిచేయాలని పై స్థాయిలో ఎంత చెప్పినా దిగువకు వచ్చేసరికి అది అనుకున్నంతగా వర్కౌట్ కాకపోవచ్చు అని అంటున్నారు. మిత్రులకు ఎక్కువ సీట్లు ఇస్తే ఓట్ల బదిలీ జరగకపోగా రెబెల్స్ పెరుగుతారని అలాగని తక్కువ సీట్లే కూటమి ఐక్యంగా పోటీకి అవరోధంగా మారుతుందని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. ఏ విధంగా చూసినా 2024లో జరిగినంత కట్టుగా ఈసారి మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కానీ పోటీ కానీ జరిగే వీలు లేదన్నది వైసీపీ అంచనాగా ఉంది. దాంతో తమకు ఇక్కడే అడ్వాంటేజ్ ఉంటుందని కూడా లెక్క వేసుకుంటోంది.
జగన్ దిగితేనే :
అయితే వైసీపీకి ఎన్ని అంచనాలు ఉన్నా ఎంతలా క్యాడర్ ని లీడర్ ని యాక్టివ్ చేసి రంగంలోకి దించినా జగన్ కూడా కీలక సమయంలో జనంలోకి రాకపోతే పార్టీకి అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే మేయర్ జెడ్పీలు అన్నవి కీలకంగా ఉంటాయి. జిల్లా నగరాలలో ముఖ్య కేంద్రాల రాజకీయాలను ఇవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎంతో కొంత సానుకూలత వైసీపీకి రావాలీ అంటే జగన్ ముఖ్యమైన చోట్ల అయినా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది అన్న భావన అయితే పార్టీలో ఉంది. జగన్ మొత్తానికి మొత్తం తిరగకపోయినా కీలక జిల్లాలలో ముఖ్యమైన రీజియన్లలో సభలు పెడితే కనుక వైసీపీ విజయావకాశాలను విశేషంగా ప్రభావం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
నిజంగా వస్తారా :
అయితే జగన్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నిజంగా వస్తారా అన్నది అయితే తెలియదనే అంటున్నారు. జగన్ 2021 ఎన్నికల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉంది అన్ని బలాలూ అనుకూలించాయని అంటున్నారు. ఇపుడు అలా కాదని వైసీపీకి ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి అని కూడా చెబుతున్నారు. అందువల్ల జగన్ వస్తేనే బాగుంటుంది అన్నది పార్టీలో నేతల మాటగా ఉంది అని ప్రచారం సాగుతోంది. రెండేళ్ళకు పైగా సాగిన కూటమి పాలన మీద జగన్ చేసే విమర్శలు ఆయన ప్రసంగాలు అయితే జనంలోకి బాగా వెళ్తాయని అంటున్నారు. అలా వైసీపీకి అనుకూలత ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి జగన్ ప్రచారానికి వస్తారా రారా అన్నది అపుడే తేలుతుందని అంటున్నారు.