పక్కోడి వైపు తొంగి చూడకు బ్రో !

సమస్యలు వస్తే వస్తాయి, అవి కూడా మనుషులకే వస్తాయి. గట్టిగా చెప్పాలంటే ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతగా సమస్యలు చుట్టుముడతాయి.

Update: 2026-09-06 07:15 GMT

నీ జీవితం బాగుండాలి అంటే పోలికలు పెట్టుకోవద్దు. అసలు అలాంటి ఆలోచనలే వద్దే వద్దు. నీ జీవితం నీ ఇష్టం. ఎవరీది వారికే ఉంటుంది. కవలలుగా పుట్టినా కూడా ఆ ఇద్దరి బతుకులూ ఒకేలా ఉండవు. అలాంటిది పక్కోడి లైఫ్ తో నీ లైఫ్ ని ఎలా పోల్చుకుంటావ్ బ్రో. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు. దీని వల్ల బాధ తప్ప ఒరిగేది ఏముంది. నిజం చెప్పాలీ అంటే అదంతా ఈ ఒట్టి భ్రమ తప్ప పక్కోడు ఏమీ సుఖపడిపోవడం లేదు, ఆ పక్కోడి పక్కన ఉన్న బలిసినోడు అని నీవు అనుకుంటున్నావే వాడు కూడా ఏమి ఖుషీగా లేడు. అంతా పైపైకి మెరుగులే. అంతా మేకప్పులు పూసుకుని నవ్వుల పౌడర్లు ముఖానికి రాసుకుని బయట జాలీగా తిరిగేస్తూ ఫోజులు ఇస్తున్నారు తప్పించి ఎవరి బతుకు చూసినా ఏముంది గర్వ కారణం సమస్త బాధల చిత్రం అని నీకు ఎప్పుడు అర్ధమవుతుంది బ్రో.

ప్రాబ్లమ్స్ నీకేనా :

సమస్యలు వస్తే వస్తాయి, అవి కూడా మనుషులకే వస్తాయి. గట్టిగా చెప్పాలంటే ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతగా సమస్యలు చుట్టుముడతాయి. వాటిని పట్టుకుని వేలాడుతూ అందులోనే పడి కిందా మీద అయిపోతూ నా జీవితం వేస్టు అనుకుంటే అక్కడితో నీవు పాతాళం అంచులు చూసేసినట్లే. నిన్ను ఎవడూ కాపాడలేడు బ్రో. ఎందుకంటే ఒక్కసారి నీవు తెలివి తెచ్చుకుని చూస్తే అందరి జీవితాల్లోనూ సమస్యలు ఉన్నాయి. ప్రతీ వారినీ చికాకులు సతమతం పెడుతూనే ఉన్నాయి. బాధలు అన్నవి బంధాలుగా పట్టుకుని పీడిస్తూనే ఉన్నాయి. అయితే వాటిని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్ చేస్తారు, అతిగా ఆలోచించి ఆవేదన చెందేవారే ఈజీగా వాటికి చిక్కిపోతూంటారు.

సవాళ్లు లేకపోతే ఎలా :

ప్రశ్న ఉంటేనే జవాబు వెతకాలనిపిస్తుంది. అలాగే సవాళ్ళు లేకపోతే జీవితం ఎలా సాగుతుంది. అన్నీ తన చుట్టూ ఉన్నా అష్ట ఐశ్వర్యాలు తనతోనే ఉన్నా కూడా సిద్ధార్థుడు ఎంతో లోటుగా భావించాడు, తనకు ఏదో కరవు అయిందని కూడా ఆలోచించాడు. చివరికి జ్ఞానం కోసం అంతపురాలని దాటుకుంటూ బయటకు వచ్చిన సిద్ధార్థుడు అలా గౌతమ బుద్ధుడు అయ్యాడు. దీనిని బట్టి అర్థం అయ్యేది ఏమిటి. ఎంత సుఖాలు ఉన్నా కూడా మనసుకు శాంతి ఉండదు, అసలు మనసుకు ఆనందం కావాలీ అంటే అది ఎక్కడో భౌతికంగా కనిపించే దాంట్లో లేదు. మనసులో ఉంది. ఆనందాన్ని అక్కడ సృష్టించుకోవాలి. అపుడు నీ కంటే అదృష్టవంతుడు ఉండడు బ్రో.

నీ నుంచి దూరంగా :

అసలు నీవు నీ నుంచి కాస్తా దూరంగా వెళ్ళి ఆలోచించడం మొదలెట్టు. నీకు నీవే సలహా ఇచ్చుకో. నీవు అన్న మరో మనిషికి మంచి సూచనలు ఇవ్వడం మొదలెట్టు. ఆనందంగా ఉండడం ఎలాగో తెలియచెప్పు. అపుడు ఉంటుంది కదా అసలైన సంతోషం. పుట్టిన ప్రతీ రోజూ బోలెడు కష్టాలను మోసుకుని వస్తుంది. అలాగే సమస్యలు కూడా వెంటనే ఉంటాయి. అలా అన్నీ ఉండవు, వాటి మధ్యలోనో చివరలోనో ఏదో ఆనందం కలిగించే చిన్నపాటి విషయం కూడా ఉంటుంది. నీవు దానికే పెద్దగా చూడడం నేర్చుకో. సమస్యలను కొండంత చేసుకుని కూర్చుంటే వాటి అడుగున పడి రవ్వంత సంతోషం కూడా చితికిపోతుంది.

కాగితం పడవగా చేసుకుని :

అందుకే దానినే కొండంతగా చూడు, అలా ఆలోచించడంలోనే నీ గొప్పదనం ఉంది. అపుడే ఆనందం కూడా నీ సొంతం అవుతుంది. ఒక్క మాట బ్రో. అమ్మ కడుపులో నీవు ప్రాణం పోసుకున్నప్పటి నుంచే కష్టాలు బాధలూ వెన్నంటే ఉంటాయి. వాటినే చూస్తూ కృంగిపోవడం మొదలెడితే నీవు కొట్టుకుపోతున్నట్లే. అందుకే కాస్తా ఆగి ఏ చిన్నపాటి సంతోషం కనిపించినా పొదివి పట్టుకో. దానినే కాగితం పడవగా చేసుకుని కష్టాల కడలిని ఈదడం నేర్చుకో. జీవితం అంటే మూడు అక్షరాలు మూడు క్షణాలు అని గుర్తు పెట్టుకుంటే చాలు, బాధలు ఎంత చిన్నవో ఇంకా బాగా అర్ధం అవుతుంది.

Tags:    

Similar News