చేతులు కాలాక ... ఏడిస్తే ఏమొస్తుంది ?!
అయితే తన తల్లి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించిన విషయంలో కొండా సుష్మిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది.
‘చేతులు కాలాక .. ఆకులు పట్టుకోవడం’ అంటే ఇదేనేమో. సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత గతంలో ఒకసారి, ఇటీవల తాజాగా కయ్యానికి కాలు దువ్విన విషయం తెలిసిందే. పరకాల సీటుకు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని, అది కొండా ఫ్యామిలీ సామ్రాజ్యం అని, చేతనయితే రేవంత్ రెడ్డి, వాళ్ల నాన్న, తాత ఎవరు వస్తారో నా మీద నిలబడి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే . తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తే తన ప్రతిస్పందన మరోవిధంగా ఉంటుందని కూడా హెచ్చరించింది.
కాంగ్రెస్ పార్టీలో వ్యాఖ్యలు కలకలం రేపడం, కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆమె సమాధానం ఇవ్వడం, దానికి క్రమశిక్షణ సంఘం సంతృప్తి చెందక పోవడం, ఆమెను మంత్రి పదవి నుండి తొలగించాలని అధిష్టానానికి సిఫారసు చేయడం, ఆమె ఢిల్లీకి వెళ్లి వివరణ ఇవ్వడం, చివరకు ఆమెను పదవి నుండి తొలగించడానికే మొగ్గు చూపిన అధిష్టానం ఆమెను బర్తరఫ్ చేయడం జరిగిపోయింది.
అయితే తన తల్లి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించిన విషయంలో కొండా సుష్మిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. పదవి నుండి తొలగించిన రోజు వివిధ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తీవ్ర ఆరోపణలు చేసిన సుష్మిత ఇప్పుడు తన తల్లిని తొలగించడంపై ఛానళ్ల ముందు ఏడుస్తుండడం చర్చానీయాంశంగా మారింది.
‘నేను చేసిన వ్యాఖ్యల మీద తన తల్లి మీద చర్యలు తీసుకుంటారని అనుకుంటే తాను అసలు మాట్లాడక పోయే దానినని, ఎంపీపీ స్థాయి నుండి ఎంతో కష్టపడి రెండు సార్లు మంత్రి అయిన తన తల్లిని ఇలా అవమానిస్తారని ఊహించలేదని, మా అమ్మను బలిచేయడం ఎంత వరకు కరెక్ట్. రేవంత్ రెడ్డి నామీద కోపాన్ని నా తల్లి మీద చూయించాడని’ బోరున విలపించింది. నా వల్లే నా తల్లికి అవమానం జరిగిందని వ్యాఖ్యానించింది.
తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు సుష్మిత విలపించడాన్ని తల్లి పదవి పోయిన నేపథ్యంలో కలిగిన బావోద్వేగం అని అంటున్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అలా మాట్లాడేదాన్ని కాదు అని సుష్మిత అంటున్నా ఇది ఆ కుటుంబానికి తగిలిన రాజకీయ దెబ్బ అని, సుష్మిత ఇంతకు ముందు ఓఎస్డీ సుమంత్ వివాదంలోనూ ఇలాగే రచ్చ చేసిందని, తాజా పరిణామాలు ఆమె తల్లి పదవిని కాపాడలేకపోయాయని అంటున్నారు.