కొండా : బీజేపీ చెత్త కుండి కాదు !

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘కొండా సురేఖ బీజేపీ పార్టీలో చేరుతాం అంటే స్వాగతిస్తాం.

Update: 2026-09-06 06:56 GMT

‘బీజేపీ పార్టీ చెత్త కుండి కాదు. ఎవరు పడితే వారిని పార్టీలో చేర్చుకోబోము. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని దారిమళ్లించే వ్యవహారంగా చేస్తున్న ప్రయత్నం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. అంతే కాని ఇది అసంతృప్త నేతలకు గమ్యస్థానం కాదు’ అని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ పి.మురళీధర్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు కలకలం రేపుతున్నది.

మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీలో కొద్దిరోజుల పాటు ఆమె మీద చర్యలు తీసుకునే విషయంలో అంతర్గతంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఆమె బీజేపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. ఈ పరిస్థితులలోనే ఆమెను పలువురు బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను పదవి నుండి తొలగించిన నేపథ్యంలో మురలీధర్ రావు ఈ పోస్ట్ చేయడం బీజేపీలో ఏం జరుగుతుంది ? కొండా సురేఖ విషయంలో ఆ పార్టీ వైఖరి ఏమిటి అన్న చర్చ మొదలయింది.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘కొండా సురేఖ బీజేపీ పార్టీలో చేరుతాం అంటే స్వాగతిస్తాం. ఆమె మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేపథ్యంలో ఆమెను చేర్చుకునేందుకు పార్టీలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవని’ అభిప్రాయపడ్డారు. అరవింద్ ఆహ్వానం నేపథ్యంలోనే మురళీధర్ రావు పోస్ట్ పెట్టారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో బీజేపీ ఎంపీ డీకె అరుణ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాల మూలంగా కొండా సురేఖను మంత్రి పదవిని తప్పించడం బాధాకరమని, అయితే ఆమెను బీజేపీలోకి ఆహ్వానించే విషయంలో పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని’ అన్నారు. వైఎస్ హయాంలో డీకె అరుణ, కొండా సురేఖలు ఇద్దరూ మంత్రులుగా పనిచేయడం గమనార్హం.

బీజేపీలో అగ్రెసివ్ గా మాట్లాడే ఎంపీలలో ధర్మపురి అరవింద్ ఒకరు. వరసగా రెండు సార్లు నిజామాబాద్ నుండి గెలిచారు. ఇటీవలి కాలంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి మీద నేరుగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం కాగా, కొండా మురళి మున్నూరు కాపు. ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు. అందుకే ఆయన ఒక అడుగు ముందుకు వేసి కొండాను ఆహ్వానించాడని భావిస్తున్నారు. అయితే ఉత్తర తెలంగాణకే చెందిన బీజేపీ నేత మురళీధర్ రావు కొండా సురేఖ చేరిక అంశంపై ఘాటుగా పోస్ట్ పెట్టడం విశేషం.

Tags:    

Similar News