మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. అయితే సోషల్ మీడియాలో జాగ్రత్త!
కేవలం కేంద్ర ప్రభుత్వానికే కాదు.. అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించేలా చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ముగ్గురు మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. అయితే.. సోషల్ మీడియాను వినియోగించే విషయంలో ఇకపై జాగ్రత్తలు పాటించకతప్పదు. ఎందుకంటే.. ఇకనుంచి సోషల్ మీడియాలో దూకుడుగా ఉండే ఉద్యోగులకు, వివాదాస్పద వ్యాఖ్యలు, రీల్స్ చేసే ఆఫీసర్లకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికే కాదు.. అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించేలా చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ముగ్గురు మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు వరకు..
వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అంటే.. అటు కేంద్రంలోకానీ, ఇటు రాష్ట్రాల్లో కానీ పనిచేసేవారు.. రాజకీ యాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలను విమర్శించరాదు. ప్రబుత్వ విధానాలు పాలకుల పనితీరులోని లోపాలను ఎత్తి చూపడానికి వీల్లేదు. ఈ మేరకు సర్వీసు రూల్స్ ఉన్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా.. సర్వీసు రూల్స్ ప్రచారం విచారణ చేసి.. డిపార్ట్‌మెంటల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇది ఇప్పటి వరకు ఉన్న నిబంధన. అటు కేంద్రంలోను... ఇటు రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతోంది. ఇటీవల ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంటరామిరెడ్డిని ఏపీ ప్రభుత్వం ఈ సూత్రం ప్రకారమే ఉద్యోగం నుంచి తప్పించింది.
ఇక నుంచి..
ఇక, త్వరలోనే సోషల్ మీడియా విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, ట్విట్టర్(ఎక్స్) సహా.. ఏ ఇతర మాధ్యమాల్లో అయినా.. ఉద్యోగులు తమ హద్దులు మీరి కామెంట్లు చేసినా.. రీల్స్ చేసినా.. పాలనలో ఉన్న నాయకులను ఇమిటేట్ చేసినా.. సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో కేసు తీవ్రతను బట్టి వారి ఉద్యోగం ఊడిపోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ కేసు తీవ్రత తక్కువగా ఉంటే.. ఇంక్రిమెంట్లలో కోత, పదోన్నతి నిరాకరణ వంటివి ఉండనున్నాయి.
ఏం జరుగుతోంది?
దేశవ్యాప్తంగా పలువురు సర్వీసులో ఉన్న ఉద్యోగులు, అధికారులు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రభు త్వాలు ఇస్తున్న పథకాలను, చేస్తున్న పనులను వారు తప్పుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సర్కారుకు ఇబ్బందిగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై బీహార్, యూపీలకు చెందిన నలుగురు ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఇక, రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలానే ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇవి.. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి.