2023లో కోమటిరెడ్డి బ్రదర్స్.. అలా చేశారా? సంచలన విషయం!
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపే వ్యవహారం మరొకటి తెరమీదికి వచ్చింది. 2023 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో.. ఇప్పు డు తాజాగా చర్చకు దారితీసింది.
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపే వ్యవహారం మరొకటి తెరమీదికి వచ్చింది. 2023 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో.. ఇప్పు డు తాజాగా చర్చకు దారితీసింది. అది ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నాయకులకు ఉద్దేశించిందే కావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది. అప్పటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత సీఎం, అప్పటి పీసీసీ చీఫ్ హోదా లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. బీఆర్ ఎస్ సర్కారును దింపేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని బావించారు. అయితే.. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు ఆయనకు సహకరించేందుకు ముందుకు రాలేదన్నది వాస్తవం.
అయితే వారు ఎవరు? ఎక్కడివారు? అనే విషయాలను మాత్రం బయట పెట్టలేదు. తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు.. అప్పట్లో కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలో బీఆర్ ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి సంచలన విషయాలను బయట పెట్టారు. అయితే.. అప్పట్లో తమ అధినేత కేసీఆర్ వారిని తీసుకోలేదన్నారు. తీసుకోవడం.. తీసుకోకపోవడం వంటివి పక్కన పెడితే.. అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి నాయకత్వంతో విభేదించారన్న విషయం వెలుగు చూడడం గమనార్హం.
ఇదే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పీఠం ఆశిస్తున్నారు. కానీ, వారు రెండున్నరేళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని అంచనా వేయడంతోపాటు బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపడం.. ఆ పార్టీలోకి చేరాలని అనుకోవడం దరిమిలా.. వారి విషయం కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం కాకరేపుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ విషయం కూడా ఆసక్తిగా మారింది. అయితే.. ఈ విషయంపై బ్రదర్స్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు.. రాజగోపాల్ మంత్రిపీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారు కూడానా..
బీఆర్ ఎస్ పార్టీ నుంచి గత 2023 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పది మంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం గా రేవంత్ రెడ్డి నాయకత్వానికి జై కొట్టారు. వీరిపై వేటు వేయాలని బీఆర్ ఎస్ నాయకత్వం పోరాడుతోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. కానీ, ఈ విషయం తేలలేదు. మరోవైపు వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు.. తిరిగి బీఆర్ ఎస్ బాటపడతామని కోరుతున్నట్టు జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. వారిని చేర్చుకునే విషయంపై చర్చ సాగుతోంది. ఇతర ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చేర్చుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.