చైనాపై ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించిన భార‌త్‌.. మ‌రి మ‌న సంగ‌తేంటి?

భార‌త దేశంలో చైనా ఉత్ప‌త్తుల మార్కెట్ ఎలా ఉంది? అంటే.. చెప్ప‌డానికి ఏమీ లేదు.. చూడ‌డ‌మే! అన్న‌ట్టుగా ఉంది. ఎందుకంటే.. ఇంట్లో వినియోగించే దాదాపు 60 శాతం ఉత్ప‌త్తుల‌పై చైనా ప్ర‌భావం ఉంది.

Update: 2026-09-06 03:37 GMT

భార‌త దేశంలో చైనా ఉత్ప‌త్తుల మార్కెట్ ఎలా ఉంది? అంటే.. చెప్ప‌డానికి ఏమీ లేదు.. చూడ‌డ‌మే! అన్న‌ట్టుగా ఉంది. ఎందుకంటే.. ఇంట్లో వినియోగించే దాదాపు 60 శాతం ఉత్ప‌త్తుల‌పై చైనా ప్ర‌భావం ఉంది. సిమ్ నుంచి మొబైల్ వ‌ర‌కు.. వాడే టూత్ బ్రెష్ నుంచి తినే నూడుల్స్ దాకా.. చాలా వ‌ర‌కు చైనా నుంచి వ‌స్తున్న దిగుమ‌తుల‌ను ఆస‌రా చేసుకుని భార‌త్‌లో త‌యారు చేస్తున్న‌వే. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ భాగాలు, గృహోపకరణాలు భారత్‌లోకి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి.

పారిశ్రామిక రంగాల విష‌యానికి వ‌స్తే.. సోలార్ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్ ముడిసరుకులు, ఆటో విడిభాగాలు, యంత్రాల కోసం భారత్ పెద్ద ఎత్తున చైనాపై ఆధారపడుతోంది. తక్కువ ధరలకు ఆకర్షణీయమైన వినియోగ వస్తువులు, హోమ్ డెకార్, బొమ్మలు అందుబాటులో ఉండటంతో మార్కెట్లో వీటికి డిమాండ్ తగ్గలేదు. ఇక‌, చైనా బ‌జార్ పేరుతో అటు హైద‌రాబాద్‌లోను, ఇటు విజ‌య‌వాడ‌లోనూ ఏకంగా చైనా వ‌స్తువుల విక్ర‌య‌మే జ‌రుగుతోంది. ప్ర‌తి ఆదివారం.. ఎర్ర‌గ‌డ్డ‌లో పెట్టే వారాంత‌పు సంత‌కు చైనా వ‌స్తువులే ముడి స‌రుకు!.

ఇలా .. భార‌త్‌లో చైనా ఉత్ప‌త్తుల విక్ర‌యాలు, వినియోగం ఏమాత్రం త‌గ్గ‌లేదు. చిత్రం ఏంటంటే.. చైనా ఉత్ప‌త్తులను త‌గ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మం కింద భార‌త్‌లో ఉత్ప‌త్తులు చేప‌ట్టాల‌ని.. విదేశాల‌పై ముఖ్యంగా చైనాపై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించాల‌ని దిశానిర్దేశం చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కార్య‌క్ర‌మం కింద చేప‌ట్టే ప‌రిశ్ర‌మ‌ల‌లో, కొన్ని రంగాల్లో చైనా దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతుండ‌డం.

ఇప్పుడు ఇవ‌న్నీ ఎందుకంటే..

తాజాగా చైనా విష‌యంలో భార‌త్ త‌మ‌ను హెచ్చ‌రించింద‌ని ఐరోపా దేశాలు చెబుతున్నాయి. భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న బెల్జియం ప్రధాని బార్ట్‌ డె వెవర్ ఈవిష‌యాన్ని ప్ర‌స్తావించారు. చైనా నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కు దిగుమ‌తి అవుతున్నాయ‌న్న ఉద్దేశంతో వాటిని త‌మ దేశాల్లో ప్ర‌వేశ పెట్టామ‌ని.. కానీ, ప్ర‌స్తుతం త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ల‌కిందులు అయ్యే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని బెల్జియం ప్రధాని బార్ట్‌ డె వెవర్ చెప్పారు. ఈ విష‌యంలో భార‌త ప్ర‌ధాని మోడీ త‌మ‌ను ఇప్ప‌టికే హెచ్చ‌రించార‌ని.. కానీ, తామే విన‌లేద‌ని అందుకే ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ లో చైనా ఉత్ప‌త్తుల మాటేంట‌న్న ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.

Tags:    

Similar News