పాపం రాజగోపాల్.. కొండా దెబ్బకు యూటర్న్!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర చుగా మీడియాలో ఉంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా మీడియాలో ఉంటున్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని ఆక్రోశిస్తున్న ఆయన.. దానిని ఎలాగైనా సాధించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఆయన సామ, దాన, బేధ, దండోపాయాల్లో కుదిరిన సమయం లో కుదిన దానిని వినియోగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బేధోపాయాన్ని(వైరం) అనుసరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
లేస్తే నేను మంచోడిని కాదు.. అన్నటైపులో వ్యాఖ్యలు గుప్పించారు. మునుగోడులో సొంత అధికారం చలాయిస్తున్నారు. బెల్టు షాపులు నిర్వహించేది లేదన్నారు బాగానే ఉంది. కానీ.. ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తెచ్చుకున్న మద్యం దుకాణాలపైనా ఆయన ఆంక్షలు పెట్టారు. అధికారులపై చిందులు తొక్కారు. కానీ, తాజాగా ఇప్పుడు రూటు మార్చేశారు. తాజా మాజీ మంత్రి కొండా సురేఖపై పార్టీ వ్యవహరించిన తీరుతో కంగుతిన్న రాజగోపాల్ రెడ్డి ఏకంగా సామ మార్గం(బుజ్జగించడం)పట్టారు.. అబ్బే నేను సీఎం ను ఏమీ అనలేదని.. అదంతా తనంటే గిట్టని ఓ మీడియా చేసిందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. సీఎం రేవంత్‌తో తనకు ఎప్పుడూ ఎలాంటి పేచీ పంచాయితీలు లేవని కూడా రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. రేవంత్ రెడ్డి వంటి బలమైన నాయకుడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని.. మళ్లీ మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఇక్కడితో కూడా ఆగకుండా.. మునుగోడు నియోజకవర్గానికి 2 వేల కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారని.. తద్వారా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయన్నారు. కానీ, రెండు మాసాల కిందట తన నియోజకవర్గం పాకిస్థాన్‌లో ఏమైనా ఉందా? అని ఇదే రాజగోపాల్ ప్రశ్నించడం గమనార్హం.
ఇక, ఇప్పుడు మరో మాట కూడా చెప్పుకొచ్చారు. త్వరలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తన నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో తరలివెళతానని రాజగోపాల్ చెప్పడం గమనార్హం. మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం తేలిపోయిన దరమిలా.. నిన్న మొన్నటి వరకు ఎగిరి పడిన చాలా మంది నాయకులు లైన్‌లోకి వచ్చేస్తున్నారు. కొందరు ఇంటి నుంచి బయటకు కూడా రాకపోగా.. మరికొందరు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు కోమటిరెడ్డి చేరిపోయారు. మరి మున్ముందు.. ఈ శాంతి వచనాలు ఇలానే కొనసాగుతాయో లేదో చూడాలి.