ఆంధ్ర పేప‌ర్ మిల్స్‌కు మూడిన‌ట్టేనా?

దీనిపై ఆ సంస్థ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. దీంతో తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Update: 2026-09-06 05:20 GMT

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఆంధ్ర పేప‌ర్ మిల్స్ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంస్థ నుంచి వ‌స్తున్న వ్య‌ర్థాల‌ను డైరెక్టుగా గోదావ‌రి న‌దిలోకి వ‌దిలేస్తున్న విష‌యంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త నాలుగు నెల‌ల కిందటే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నోటీసులు ఇచ్చి చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అదే స‌మ‌యంలో ఈ మిల్లు ప్ర‌భుత్వానికి ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల‌కు చెల్లించాల్సిన ప‌న్నుల విష‌యంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల కూడా తీవ్రంగా స్పందించా రు. దీనిపై ఆ సంస్థ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. దీంతో తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఏం జ‌రుగుతోంది?

తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరంలో రోజూ దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో ఒక్క ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచే ఏకంగా 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు వస్తున్నాయి. మిల్లు వ్యర్థాల నమూనాలను పరీక్షించగా.. లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది నిర్ణీత ప్రమా ణాల కంటే 20 శాతం అధికం. దీంతో స్థానికంగా ఉన్న చేప‌ల చెరువులు, రొయ్య‌ల చెరువుల‌తోపాటు సాగు, తాగునీరు కూడా క‌లుషితం అవుతోంది.

ఇక‌, ఆంధ్ర పేప‌ర్ మిల్లు.. 2016 తర్వాత నుంచి కాతేరు గ్రామ పంచాయతీకి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎలాంటి పన్నులు చెల్లించలేదు. ఇప్పటివరకు 21.34 కోట్ల రూపాయ‌ల మేర‌కు బకాయిలు ఉన్నాయని అధికారులు లెక్క‌లు తీశారు. ఈ నేప‌థ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం మిల్లుకు సమన్లు జారీ చేసి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే.. ఈ మేర‌కు.. చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. ఎందుకంటే.. ఒక‌వైపు కోర్టులో కేసులు వేస్తున్నారు. మ‌రోవైపు రాజ‌కీయంగా కూడా ప్ర‌భావం చూపిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో అధికారులు ఎలాంటి దారి ప‌డ‌తారో చూడాలి.

Tags:    

Similar News