పవన్ రెడీ అంటే.. దూకుడే!
గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు..నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాల వరకు అన్ని కమిటీలను ఇటీవల పార్టీ అధినేత రద్దు చేసిన విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ `రెడీ` అంటే చాలు.. రంగంలోకి దిగేందుకు భారీ సంఖ్యలో నాయకులు కాచుకుని కూర్చున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు..నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాల వరకు అన్ని కమిటీలను ఇటీవల పార్టీ అధినేత రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటిలో కీలక నాయకులు, మేధావులు, పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే.. కొత్తగా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారే కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా పార్టీ చర్యలు తీసుకోలేదు.
దీంతో పదవుల కోసం ఎదురు చూస్తున్నజనసేన నాయకులు.. పవన్ కల్యాణ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కమిటీల ఏర్పాటు పార్టీకి, ముఖ్యంగా పవన్‌కల్యాణ్ రాజకీయ వ్యూహాలకు కూడా అత్యంత అవసరంగా మారింది. అయితే.. గతంలో తాను ఏర్పాటు చేసిన కమిటీల్లోని నాయకులు దారి తప్పుతున్నారని.. పార్టీపరంగానేకాకుండా.. కీలకమైన కూటమికే ఇబ్బందులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని భావించిన పవన్ .. వాటిని ఒక్క నిర్ణయంతో రద్దు చేశారు.
కానీ, ఎక్కువ కాలం వేచి చూసేందుకు.. కమిటీలు లేకుండా పార్టీని నిలబెట్టేందుకు అవకాశం తక్కువగానే ఉంది. స్థానికంగా జరిగే ఎన్నికల్లో నాయకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి నాయకులు ఇప్పుడు కమిటీలను రద్దు చేయడంతో సుప్తచేతనావస్థలో ఉన్నారన్నది పార్టీకిఅందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామ, పట్టణస్థాయి కమిటీల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం. ఇవి స్థానికెన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
వీటిని ఏర్పాటు చేయడం ద్వారా.. పార్టీపరంగా పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. పార్టీ సిద్ధాంతాల కు..కమిటీ నాయకులకు ముడిపెడుతున్న పవన్.. ఈ విషయంలో తగ్గేదేలేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమిగా ముందుకు సాగాలన్నదే పవన్ లక్ష్యంగా ఉంది. ఈ దిశగానే కమిటీలను ఏర్పాటు చేయాలని తలపోస్తు న్నారు. కానీ, ఎప్పటికి ఏర్పాటు చేస్తారు? అనేదిప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికిపైగా నాయకులు, క్షేత్రస్థాయి కేడర్ఈ కమిటీల ఏర్పాటు కోసం నిరీక్షిస్తున్నారు. పవన్ సై అంటే.. సై సై అంటూ.. రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఎప్పుడు నిర్ణయిస్తారు? అనేది చూడాలి.