మహేష్ గౌడ్ మినిస్టర్...కొత్త పీసీసీ చీఫ్ ఆయనే ?
గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణా కాంగ్రెస్ లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఒక పెద్ద కుదుపు అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపించింది. మహిళా నాయకురాలు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో ఉన్న బీసీ నేత ఫైర్ బ్రాండ్ ని తప్పించడం అన్నది ఒక విధంగా చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కొందరు అతిగా మాట్లాడుతూంటారు, కానీ కొండా సురేఖ విషయంలో డిఫరెంట్ యాక్షన్ కనిపించింది అని బీసీ వర్గాలు అనుకోక ముందే పార్టీని ప్రభుత్వాన్ని మరింతగా ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కదులుతోంది అని అంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ లో చాలా మంది మంత్రి పదవుల విషయంలో ఆశ పెట్టుకున్నారు. అదే విధంగా మరి కొందరు పార్టీలో కీలకం కావాలని చూస్తున్నారు. దాంతో అన్ని రకాలైన పరిణామాలు బేరీజు వేసుకుంటూ కాంగ్రెస్ తెలంగాణాలో ఇపుడు కీలక చర్యలను చేపట్టబోతోంది అని అంటున్నారు.
త్వరలోనే విస్తరణ :
గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. కొండా సురేఖ బర్తరఫ్ ఇష్యూని మరచిపోయేలా మరి కొందరికి కూడా ఉద్వాసన పలికి ఇంకొంతమందిని తీసుకోవాలని చూస్తోంది. ఇక మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి బెర్త్ ఖాయమని అంటున్నారు. ఆయన చాలా కాలంగా మంత్రి పదవి కోసం చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఖాళీగా ఉన్న మూడు బెర్తులతో పాటు మరి కొన్ని బెర్త్ లను కూడా ఖాళీ చేయించి అయినా కనీసంగా అరడజను మంది కొత్త వారిని మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు అని అంటున్నారు. ఇక మంత్రి వర్గ విస్తరణ అన్నది తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అనంతరం ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నెల 7 నుంచి మంత్రి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.
పార్టీ బాధ్యతలు ఎవరికి :
ఇదిలా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే పీసీసీ పీఠం ఖాళీ అవుతుంది. దాంతో ఈ కీలక పదవి ఎవరికి ఇస్తారు అన్నది కూడా చర్చగా సాగుతోంది. మరో వైపు చూస్తే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవీ కాలం కూడా ఈ నెల 15తో పూర్తి అవుతోంది అని అంటున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారు అని అంటున్నారు. వీరిద్దరే కాకుండా మరి కొందరు కూడా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభీష్టం మేరకే ఈ పదవిలోకి ఎవరైనా వస్తారు అని అంటున్నారు.
మంత్రి రేసులోకి :
ఇంకో వైపు చూస్తే స్పీకర్ గెడ్డం ప్రసాద్ తో పాటు పలువురు కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి, నలమాద పద్మావతీ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని అంటున్నారు. ఇక ఎన్నికల ముందు తనకు ఇచ్చిన హామీ ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తూ వస్తున్నారు. ఆయన మంత్రి పదవిని బలంగా కోరుకుంటున్నారు. అయితే ఆయనకు నల్గొండ జిల్లా రాజకీయ సామాజిక సమీకరణలు మంత్రి పదవికి అడ్డంకిగా మారాయి. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం మరో మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారా అనంది సందిగ్ధంగా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మరోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటుందని అంటున్నారు. అక్కడ జరిగిన చర్చల అనంతరం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేస్తారు అని అంటున్నారు.