కేటీఆర్, హరీష్ లను సీఎం రేవంత్ ఓడించగలడా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ మధ్య శత్రుత్వం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

Update: 2026-09-06 13:30 GMT

పగటిపూట నియోజకవర్గాల పర్యటనలు, రాత్రిపూట విపక్ష నేతల గుండెల్లో రైళ్లు.. సిరిసిల్ల, సిద్ధిపేట కంచుకోటల 'ఫ్యాబ్రికేషన్' ఊడదీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త పొలిటికల్ డిజైన్ ప్రారంభించారు. అధికార పీఠం ఎక్కిన క్షణం నుంచి 'ఎవరి పాయింట్ ఎక్కడ ఉందో' సరిగ్గా నోట్ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ హోమ్ గ్రౌండ్స్‌కే కబురు పంపారు. నిన్నటివరకు తమ కంచుకోటల బురుజుల పైనుంచి కాంగ్రెస్‌పై విమర్శల తోటాలు పేల్చిన కేటీఆర్, హరీశ్‌రావులకు.. ఇప్పుడు సొంత గుమ్మం ముందే భారీ బహిరంగ సభల రూపంలో వెల్‌కమ్ బోర్డులు పడుతున్నాయి. కేసీఆర్ పొలం బాట పట్టి 'రెస్ట్ మోడ్'లోకి వెళ్లడంతో.. పార్టీని మోస్తున్న అల్లుడు, అబ్బాయిలపైనే సీఎం గారు ప్రత్యేక ప్రేమాభిమానాలు కురిపిస్తున్నట్లు కనిపిస్తోంది. "సిరిసిల్లలో సభ పెడతాం.. సిద్ధిపేటలో జెండా పాతేస్తాం" అంటూ సీఎం ఇస్తున్న వార్నింగ్‌లు చూస్తుంటే.. బీఆర్ఎస్ నేతలకు గ్రేటర్ ఎన్నికల కన్నా, సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవడమే పెద్ద 'టాస్క్'లా మారేలా ఉంది. గులాబీ బాస్‌ల కోటల్లో కాంగ్రెస్ శ్రేణుల హడావుడి చూస్తుంటే.. 'మా ఇంట్లో సభలేంటి సామీ' అని విపక్ష నేతలు లోలోపల లబోదిబోమంటుండగా.. ఈ 'కంచుకోటల కరిగింపు' రాజకీయ నాటకంలో నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుందోనని తెలంగాణ ప్రజానీకం పాప్‌కార్న్ పట్టుకుని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ మధ్య శత్రుత్వం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. బీఆర్‌ఎస్ అగ్రనేతలను వారి సొంత నియోజకవర్గాల్లోనే దెబ్బతీయాలనే సంకల్పంతో కాంగ్రెస్ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట అయిన సిద్ధిపేటలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

గత దశాబ్ద కాలంగా సిరిసిల్ల, సిద్ధిపేటలు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని రాజకీయ దుర్గాలుగా నిలిచాయి. అక్కడ కేటీఆర్, హరీశ్‌రావులకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, బలమైన కేడర్ ఆ పార్టీకి ప్రధాన బలంగా మారాయి. అయితే నేరుగా ఆయా నియోజకవర్గాల్లోనే భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. త్వరలోనే సిరిసిల్లలో కాంగ్రెస్ తరఫున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో సభ పెట్టడం ద్వారా స్థానిక కాంగ్రెస్ కేడర్‌లో ధైర్యాన్ని నింపడంతో పాటు.. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును సవాల్ చేయడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

దీనికి కొనసాగింపుగా వచ్చే నెలలో సిద్ధిపేటలో మరొక భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. హరీశ్‌రావు రాజకీయ ప్రస్థానానికి మూలస్తంభమైన సిద్ధిపేటలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకోవాలనేది రేవంత్ రెడ్డి వ్యూహంలో ప్రధాన భాగం. కేసీఆర్ రాజకీయంగా కొంత సమయం వెనకడుగు వేసిన ఈ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులే బీఆర్ఎస్ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలాన్ని ప్రదర్శించడం ద్వారా బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడుతుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పునాదులను దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు.

కాంగ్రెస్ విసురుతున్న ఈ సవాల్‌ను బీఆర్ఎస్ నేతలు ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంత నియోజకవర్గాల్లో పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతివ్యూహాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలతో సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జరగబోయే ఈ బహిరంగ సభలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరును మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News