వెండి కూడా బంగారమే.. రిచ్ డాడ్ అంచనా తప్పలేదు

అంతర్జాతీయ పెట్టుబడి రంగంలో సంచలనాలకు మారుపేరైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై మరోసారి అంచనాల బాంబుపేల్చారు.;

Update: 2025-12-25 12:30 GMT

అంతర్జాతీయ పెట్టుబడి రంగంలో సంచలనాలకు మారుపేరైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై మరోసారి అంచనాల బాంబుపేల్చారు. గతంలో ఆయన చెప్పినట్టుగానే వెండి ధరలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ కు 70 డాలర్ల మార్కును తాకగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగనుందని ఆయన స్పష్టం చేశారు.

డాలర్ ఒక ఫేక్ మనీ అంటున్న కియోసాకీ

అమెరికా డాలర్ పై కియోసాకి ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. డాలర్ ను ‘ఫేక్ మనీ’గా అభివర్ణించారు. కాలక్రమేణా డాలర్ తన కొనుగోలు శక్తి కోల్పోతోందని.. ఇది సామాన్యుల పొదుపై దెబ్బతీస్తుందని హెచ్చరించారు. డాలర్ బలహీనపడటం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.

2026 లక్ష్యం ఔన్స్ కు 200 డాలర్లు

వెండి విషయంలో కియోసాకి చేసిన తాజా అంచనా ఇప్పుడు ఇన్వెస్టర్లలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఔన్స్ ధర సుమారు 70 డాలర్లు ఉంది. 2026 నాటికి ఔన్స్ కు 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా..అంటే కేవలం ఏడాదిన్నర కాలంలోనే వెండి ధర దాదాపు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. డబ్బును నగదు రూపంలో దాచుకునే వారికి ఇది గడ్డు కాలం కానీ వెండి వంటి లోహాలపై పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు.

భారత మార్కెట్లలో వెండి ధగధగ

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిలను తాకాయి. వెండి కిలోకు సుమారు రూ.2,33,100 ఉంది. బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాములకు సుమారు 1,38,940 ఉంది.

ఇన్వెస్టర్ల ఆలోచన ఏంటి?

కియోసాకి మొదటి నుంచీ బంగారం, వెండి, బిట్ కాయిన్ లను అత్యుత్తమ పెట్టుబడి సాధనాలుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన పలు అంచనాలు నిజం కావడంతో ఇప్పుడు వెండి 200 డాలర్లకు చేరుతుందన్న మాటను ఇన్వెస్టర్లు సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు వెండి వినియోగం పెరుగుతుండడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News