తిరుప‌తి నేత‌లు: పైచేయి కోసం పాట్లు.. !

ఇక‌, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గం సంగ‌తి క‌థ‌క‌థ‌లుగా మారుతోంది. ఇక్క‌డ గెలిచిన ఎమ్మెల్యే ఆదిమూలం మైన‌స్ అయ్యారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.;

Update: 2026-03-07 02:45 GMT

తిరుప‌తి రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నారు? కూట‌మి నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త ఉందా? అంటే.. నేతి బీర‌ను త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైకి అంద‌రూ బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తు న్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఎవ‌రికి వారు ప‌నులు చేసుకుంటున్నారు. పార్టీ త‌ర‌ఫున కానీ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కానీ.. ఎవ‌రూ స‌మైక్యంగా గ‌ళం వినిపించ‌లేక పోతున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పైచేయి కోసం.. కూట‌మి నేత‌ల మ‌ధ్య పోరు కొన‌సాగుతూనే ఉంది.

ముఖ్యంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని ఇటీవ‌ల టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాల‌యానికి బృందాలుగా వ‌చ్చి మ‌రీ త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. ఆర‌ణి కుటుంబ స‌భ్యుల‌తో ఇక్క‌డ రాజ‌కీయాలు మారిపోయాయ‌ని కూడా వారు చెబుతున్నారు. పోనీ.. జ‌న‌సేన‌లో అయినా.. ఆర‌ణికి పాజిటివిటీ ఉందా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. జ‌నసేన‌నాయ‌కులు కూడా ఇదే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గం సంగ‌తి క‌థ‌క‌థ‌లుగా మారుతోంది. ఇక్క‌డ గెలిచిన ఎమ్మెల్యే ఆదిమూలం మైన‌స్ అయ్యారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఓ వ‌ర్గం చెబుతుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌రంటూ.. శంక‌ర్రావు వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. గ‌త 2024 చివ‌రిలో ఆదిమూలంపై వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో పార్టీ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. త‌ర్వాత క‌లుపుకొన్నా.. నాయ‌కులు మాత్రం ఆదిమూలాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. ఇక్క‌డ ఎవ‌రికి వారే పైచేయి కోసం పాకులాడుతున్నారు.

ఇక‌, గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కూట‌మి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. టీడీపీలో మాత్రం క‌లివిడిగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే థామ‌స్ టీడీపీ నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతున్నారు. కానీ.. ఇదేస‌మ‌యంలో కూట‌మి నేత‌ల‌కు ఆయ‌న డిస్టెన్స్ పాటిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. దీనిని ఆయ‌న లైట్‌తీసుకుంటున్నారు. టీడీపీ బ‌లంగా ఉంటే చాల‌న్న‌ట్టుగా థామ‌స్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షం వైసీపీ ఇక్క‌డ పుంజుకోక‌పోవ‌డం కూడా థామ‌స్‌కు క‌లిసి వ‌స్తోంది. సో.. మొత్తంగా తిరుప‌తిలో కూట‌మి స‌ఖ్య‌త త‌క్కువ‌గానే ఉందన్న‌ది స్థానికంగా వినిపిస్తున్న మాట‌.

Similar News