రాహుల్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించిన విజయ్ ?

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కి రాజకీయ అనుభవం లేదు అన్నది తెలిసిందే. దానికి తోడు ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి.

Update: 2026-05-20 01:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కి రాజకీయ అనుభవం లేదు అన్నది తెలిసిందే. దానికి తోడు ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తన ఫిలసఫీకి కట్టుబడి ఉంటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చినపుడు అందరూ అధినాయకుడు చేసిన ప్రతీ పనినీ చూస్తారు. ఇక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తరువాత ప్రతీ చర్య జనాలు సీసీ కెమెరా పెట్టి మరీ స్కానింగ్ చేస్తారు. తమిళనాడు గడ్డ అంటేనే చైతన్యవంతమైనది. ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాంటి చోట ముఖ్యమంత్రిగా విజయ్ అయిపోయారు. ఆయనకు పాలనానుభవం లేదు. అయితే ఆయనకు ఆశలు ఉన్నాయి. ఆశయాలు ఉన్నాయి. వీటిని రాజకీయ చట్రంలో పాలనా చట్రంలో ఇమిడ్చుకుని విపక్షాలు విమర్శల బెడద నుంచి తప్పించుకుని చాలా చాకచక్యంగా మన్నన పొందాలి. తాను అనుకున్నది నెగ్గించుకోవాలి అంటే సర్వజనామోదం ఉండేలా చూసుకునేలా వ్యూహాలు ఉండాలి. విజయ్ విషయంలో ఇవి కరవు అవుతున్నాయా అన్న చర్చ ఆయన తొలి పది రోజుల పాలనలోనే మొదలైంది అంటున్నారు.

ఎల్టీటీఈ పట్ల సింపతీ :

తాజాగా ముఖ్యమంత్రి విజయ్ ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ కి నివాళులు అర్పించారు. శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన వార్షికోత్సవం అయిన మే 18న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రవాసులకు సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. 2009లో ముల్లివైక్కల్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ఆయన ఒక సందేశాన్ని అందించారు. అయితే విజయ్ ఎల్టీటీ విషయంలో ఈ విధంగా సింపతీగా ఉండడం తొలిసారి కాదు, నాగపట్టినంలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో విజయ్ గతంలో ప్రభాకరన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన శ్రీలంక తమిళుల పట్ల తల్లి లాంటి ఆప్యాయత చూపిన నాయకుడని కితాబు ఇచ్చి అప్పట్లోనే చర్చకు తెర లేపారు.

రాజకీయ దుమారం :

తాజా నివాళి రాజకీయంగా దుమారమే రేపుతోంది. ఎల్టీటీఈ ప్రభాకరన్ రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని గుర్తు చేస్తున్నారు. 1991 మే నెలలో 21వ తేదీన రాజీవ్ శ్రీ పెరుంబుదూర్ వచ్చినపుడు ఆయన దారుణ హత్య జరిగింది. దీని వెనక ప్రభాకరన్ పాత్ర ఉందని అంటారు. కాంగ్రెస్ కి కూడా ఎల్టీటీఈ తో ఏ రకమైన సంబంధాలు ఉన్న తమిళ పార్టీలైనా ఇష్టం ఉండదు, ఈ కారణంగానే చాలా కాలం పాటు డీఎంకేని దూరం పెట్టింది ఆ పార్టీ. ఇదిలా ఉంటే విజయ్ కి ఎల్టీటీఈ మీద సింపతీ ఏమైనా ఉందా అన్నది ఒక చర్చ అయితే ప్రభాకరన్ కి నివాళులు అర్పించడమేంటని అంతా ఆలోచిస్తున్నారు. ఇక చాన్స్ దొరికిందని బీజేపీ ముఖ్యమంత్రి విజయ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుబెట్టింది. ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసిన సంగతి తెలియదా అని ప్రశ్నించింది. ఆ గ్రూప్ కి చెందిన సభ్యురాలే రాజీవ్ ని హతమార్చింది అన్నది కూడా గుర్తు చేసింది. అలాంటి సంస్థకు వ్యవస్థాపకుడికీ నివాళినా అంటూ కాంగ్రెస్ దీనికి ఏమి జవాబు చెబుతారని కూడా ప్రశ్నించింది. అసలు రాజీవ్ కుమారుడు అయిన రాహుల్ గాంధీ దీని మీద ఏమి మాట్లాడుతారు అని కూడా ప్రశ్నించింది.

కాంగ్రెస్ మద్దతు కీలకం :

విజయ్ పార్టీకి నైతికంగా అలాగే నంబర్ పరంగా కాంగ్రెస్ ఇచ్చిన అయిదుగురు ఎమ్మెల్యేల బలం అత్యంత కీలకం. ముందు ఆ బలం వచ్చిన తరువాతనే చిన్న పార్టీలు సాయానికి తామూ వచ్చాయి. అలా బొటా బొటీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ నేపధ్యంలో విజయ్ తెలిసి చేశారా లేక తెలియక చేశారా అన్నది పక్కన పెడితే ఎల్టీటీఈ వ్యవస్థాపకుడికి నివాళి అన్నది కచ్చితంగా కాంగ్రెస్ కి ఆగ్రహం తెప్పిస్తుందని అంటున్నారు. గతంలో డీఎంకేనే చాలా ఏళ్ళ పాటు కాంగ్రెస్ పెద్దలు క్షమించలేదని కూడా గుర్తు చేస్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్ కనుక కోపగించి మద్దతు ఉపసంహరిస్తే విజయ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

స్టాలిన్ జోస్యాలు :

ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్ అయితే అరు నెలల పాటే విజయ్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఏ క్షణం అయినా ఎన్నికలు రావచ్చు అని కూడా అంటున్నారు. అలాంటి నేపధ్యంలో విజయ్ చేసిన ఈ పనితో ఏమైనా జరుగుతుందా అన్న కంగారు అయితే టీవీకే పార్టీలో ఉంది అని చెబుతున్నారు. అయితే విజయ్ నివాళులు అర్పించింది ఎల్టీటీఈ వ్యవస్థాపకుడుకి మాత్రమే కాదని శ్రీలంకలో పెద్ద ఎత్తున ఊచకోతకు గురి అయిన వేలాది మంది తమిళులకు అని సమర్ధించుకుంటోంది. కానీ విషయం ఇలా ఉంటే కాంగ్రెస్ ఏమి చేస్తుంది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే చర్చ. మొత్తానికి విజయ్ అస్థాన జ్యోతీష్యుడికి పదవి ఇచ్చి వెనక్కి తీసుకోవడంం ఇపుడు ఎల్టీటీఎ ఇలా తన ఆలోచనలు ఏవైనా రాజకీయ వాతావరణం ప్రభుత్వం సమీకరణలు అన్నీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది కదా అన్నదే విశ్లేషకుల మాటగా ఉంది.

Tags:    

Similar News