భోగాపురానికి ఫస్ట్ గిన్నీస్ అవార్డ్ సొంతం!
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత(గ్రీన్‌ఫీల్డ్) విమానాశ్రయం శిగలో తొలి అవార్డు చేరింది.
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత(గ్రీన్‌ఫీల్డ్) విమానాశ్రయం శిగలో తొలి అవార్డు చేరింది. విమానాశ్రయం ప్రారంభం కాకముందే.. ఈ అవార్డు రావడం.. అదికూడా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ అవార్డు దక్కడం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం వైభోగానికి ఇదే తార్కాణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు కృషి చేసి ప్రతి ఒక్కరినీ అభినందించారు.
దేనికీ అవార్డు?
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన థింసా నృత్య ప్రదర్శనకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. మన్యం ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన చిన్నారులు, మహిళలతో మొత్తం 200 బృందాలను ఏర్పాటు చేసి.. ఈ ప్రదర్శన నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం రన్‌వేపై నిర్వహించిన ఈ థింసా నృత్యం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా మంత్రులు పేర్కొన్నారు. ఈ నృత్యంలో మొత్తం 13000 వేల మంది పాల్గొన్నారని తెలిపారు. మొత్తం 200 బృందాలుగా విభజించి.. ఒక్కొక్క బృందంలో 65 మంది చొప్పున నృత్యం చేసేలా ప్రయత్నించారు.
వీరికి గత వారం రోజులుగా శిక్షణ ఇచ్చారు. అనంతరం.. నాలుగు రోజులుగా ప్రదర్శన రిహార్సల్స్ నిర్వహించారు. చివరిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం ఆధ్వర్యంలో.. శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా నృత్యం చేశారని.. గిరిజన సంస్కృతిని ప్రతిబించారని.. దీనిని వీక్షించిన గిన్నిస్ రికార్డు ప్రతినిధి బృందం కొనియాడింది. సుమారు గంటసేపు నిర్వహించిన ఈ నృత్యాన్ని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం.. రికార్డును మంత్రులకు అందించారు. కాగా.. ఈ నృత్యాన్ని ప్రధాన నరేంద్ర మోడీ రాక సందర్భంగా శనివారం కళాకారులు, గిరిజనులు ప్రదర్శించనున్నారు. తద్వారా ప్రధాని మోడీకి అత్యంత భారీ స్వాగతం పలకనున్నారు.
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఏఎస్ఆర్ విమానాశ్రయానాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు చేపడుతున్న గిరిజన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉందన్నారు.