కాలం ఎంత సిత్రమైనది సిద్దప్పా? అప్పట్లో ఈటల.. ఇప్పుడు కేసీఆర్

కాలం చానా సిత్రమైంది సిద్దప్పా.. అంటూ త్రివిక్రమ్ సినిమాల్లో ఆ పేరుతో ఉండే పాత్రకు తత్త్వ బోధన చేయటం.. దానిని సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ కు వాడటం తెలిసిందే

Update: 2026-09-18 07:30 GMT

కాలం చానా సిత్రమైంది సిద్దప్పా.. అంటూ త్రివిక్రమ్ సినిమాల్లో ఆ పేరుతో ఉండే పాత్రకు తత్త్వ బోధన చేయటం.. దానిని సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ కు వాడటం తెలిసిందే. కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చిన ఒక వ్యాఖ్య ఆకర్షించేలా ఉంది. భిన్న సమయాల్లో చోటు చేసుకునే కొన్ని పరిణామాల్ని పోల్చి చెప్పటం కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటిదే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయటం.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ దాదాపు 700 ఎకరాల మేర విస్తరించి ఉందని.. అందులో 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిసిపోయినట్లుగా ఆరోపించటం తెలిసిందే. సీఎం అసెంబ్లీ ప్రకటన వెంటనే జిల్లా కలెక్టర్ మొదలుకొని రెవెన్యూ అధికారులు భూముల లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగిన వేళ.. కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో కీలక మంత్రిగా వ్యవహరించే ఈటల రాజేందర్ విషయంలో సీఎంగా ఉన్న వేళ కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారని..తాజాగా ఆయన ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్లుగా గుర్తు చేసుకుంటున్నారు.

సొంత మంత్రి విషయంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తే.. ప్రతిపక్ష నేత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న నిర్ణయం గతాన్ని గుర్తు చేసేలా మారింది. 2021 ఏప్రిల్ - మే నెలల్లో చోటు చేసుకున్న నాటి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పై వరుసగా భూఆక్రమణ ఆరోపణలు రావటం..ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి అప్పట్లో వినిపించిన ప్రధాన ఆరోపణ.. ఈటల కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ సంస్థ కోసం పేదలకు కేటాయించిన దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేశారని సీఎంవోకు కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ టీంలు రాత్రికి రాత్రే విచారణ చేయటం.. సుమారు 85 ఎకరాల అసైన్డ్ భూమిని జమునా హ్యాచరీస్ ఆక్రమించినట్లుగా.. అనుమతులు లేకుండా గోదాములు నిర్మించినట్లుగా రిపోర్టులు ఇవ్వటం తెలిసిందే. ఓవైపు మెదక్ వివాదం నడుస్తున్న సందర్భంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్ లోని శ్రీసీతారామ స్వామి దేవాలయ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. అక్కడ భూములకు సంబంధించి దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను ఈటల రాజేందర్.. ఆయన అనుచరులు ఆక్రమించుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.

అంతేకాదు.. ముందస్తు అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ గోదాలు.. విలాసవంతమైన గెస్టు హైస్ లు నిర్మించినట్లుగా నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించారు. ఇదే సమయంలో మేడ్చల్ జిల్లా పరిధిలోని రావల్ కోల్ గ్రామానికి చెందిన ఒకరు చేసిన ఫిర్యాదుతో ఈటల అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని కబ్జా చేసిన ఆరోపణలు రావటంతో విజిలెన్స్ తో విచారణకు ఆదేశించారు. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణల్ని ఈటల దంపతులు తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. రాజకీయ కక్షసాధింపు తో ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ సందర్భంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం అప్పట్లో రాజకీయ సంచలనంగా మారింది. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజా పరిణామాల్ని చూస్తే.. ఇంచుమించు ఇదే తరహా ఆరోపణలతో సీఎం రేవంత్ విచారణకు ఆదేశించటం తెలిసిందే. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం సమీప పరిసరాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ.. రికార్డుల పరిశీలన చేపట్టారు. ఎర్రవల్లితో పాటు పొరుగు గ్రామాలైన వెంకటాపురం.. వరదరాజుపురం సరిహద్దుల పరిధిలోని సర్వే నంబరు 325 మీద అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఫామ్ హౌస్ విస్తరణలో భాగంగా దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ.. అసైన్డ్ భూముల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారులు ఎర్రవల్ల పరిసర భూముల్లో కొలతలు వేయటం.. సర్వే చేసే ప్రయత్నం చేయగా.. స్థానిక రైతులు అడ్డుకోవటం కనిపించింది.వీటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు తమ పని తాము చేసుకుపోయినట్లుగా మీడియా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. కాలం మహా సిత్రమైందని.. అప్పట్లో ఈటలకు ఎదురైన అనుభవం లాంటిదే తాజాగా కేసీఆర్ కు ఎదురైనట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags:    

Similar News