సీఎం రేవంత్ మాటలు సరే.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు చెప్పేదేంటి?

మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ భూముల విషయానికి సంబంధించి రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసిన వ్యాఖ్యలు.. విమర్శలు ఇప్పుడు రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి.

Update: 2026-09-18 06:30 GMT

మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ భూముల విషయానికి సంబంధించి రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసిన వ్యాఖ్యలు.. విమర్శలు ఇప్పుడు రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి. కేసీఆర్ కు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రికార్డుల పరంగానే 67.13 ఎకరాలు ఉన్నట్లుగా సీఎం రేవంత్ చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ భూములు ఎప్పుడు వచ్చాయి? అన్న దానిపై కేటీఆర్ అండ్ కో వినిపిస్తున్న వాదన ఒకటైతే.. సీఎం అండ్ కో చేస్తున్న వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. విమర్శలు.. ప్రతివిమర్శలతో వాతావరణం వేడెక్కిన వేళ.. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా సాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో అసలు కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు ఏం చెబుతున్నాయన్నది ఆసక్తికరం.

2004 లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ కు ఒక్క ఎకరం భూమి కూడా లేదని అప్పటి ఎన్నికల అఫిడవిట్ ను మంత్రి పొంగులేటి చూపిస్తే.. తమ కుటుంబానికి తాతల కాలం నుంచే భూములు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించటం తెలిసిందే. మరి.. అఫిడవిట్లు ఏం చెబుతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2004 లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ పేరుతో ఎలాంటి భూమి లేదన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఆ తర్వాత అంటే 2006, 2008 లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలు.. 2009 నాటి లోక్ సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లోనూ పెద్దగా భూములు ఉన్నట్లు కనిపించని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో ఆయనకు ఎర్రవల్లిలో 37.7 ఎకరాల భూమి ఉందని చూపించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అదే సమయంలో 2018లో అసెంబ్లీ ఎన్నికల నాటికి సమర్పించిన అఫిడవిట్ లో తనకు ఎర్రవల్లిలో 54.21 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్నట్లుగా పేర్కొంటూ.. అప్పట్లో దాని విలువను రూ.1.36 కోట్లుగా చూపారు.

సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో 2.04 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని చూపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో కేసీఆర్ తనకు ఎర్రవల్లిలో 65.25 ఎకరాల బూమి ఉందని.. అయితే ఆ భూమి తన ఒక్కడిదే కాదని.. తన హిందూ అవిభక్త కుటుంబానిదిగా పేర్కొన్నారు. ఈ లెక్కల చిక్కులు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కిస్తాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News