మొబైల్ EMI కోసం అమ్మకానికి రక్తం..!
ఉత్తర ప్రదేశ్‌లో నేరాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కడం మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తర భారతంలో ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో వంద రూపాయలకు హత్యలు జరుగుతాయని అంటారు.
ఉత్తర ప్రదేశ్‌లో నేరాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కడం మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తర భారతంలో ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో వంద రూపాయలకు హత్యలు జరుగుతాయని అంటారు. పాతిక రూపాయలకు పెద్ద గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయని అక్కడి వారు చెబుతూ ఉంటారు. అత్యంత కఠినంగా అక్కడి వారు ఉండటం వల్లే నేరాలు ఎక్కువగా అవుతున్నాయని, కనీసం బంధుత్వాలు, బంధాల గురించి ఆలోచించక పోవడం వల్లే నేరాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసు వర్గాల వారు చెబుతున్నారు. ఇటీవల యూపీలోని నిగోహన్ సమీపంలో జరిగిన ఒక నేరం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని, ఏకంగా అతడి రక్తంను తీసి అమ్మి, ఆ తర్వాత కూడా వదిలి పెట్టకుండా ఇంటికి తీసుకు వెళ్లి నిర్భందించి హింస పెట్టి పనులు చేయించుకున్న ఘటన పోలీసులను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
మొబైల్ EMI చెల్లింపు...
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నిగోహన్ సమీపంలో ఉండే రాజా రామ్ ఖేడా గ్రామానికి చెందిన నవల్ కుమార్ అనే వ్యక్తి EMI లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. అది బ్యాంక్ నుంచి కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద EMI పెట్టి ఆ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. నవల్ కుమార్ రూ.21,500లతో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అందుకు గాను ప్రతి నెల రూ.2800లు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు సగం EMI లు చెల్లించిన నవల్ కుమార్ కొన్ని కారణాల వల్ల రెండు మూడు నెలలు కట్టలేక పోయాడు. ఈఎంఐ రూపంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి కి కనిపించకుండా నవల్ కుమార్ తిరుగుతూ ఉండటంతో సదరు వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. మాటు వేసి నవల్ కుమార్ ను కిడ్నాప్ చేసుకుని లక్నోకు తీసుకు వెళ్లారు.
కిడ్నాప్ కేసు...
నవల్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన వారిలో అనికేత్ సింగ్, సుశాంత్ శర్మ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. నవల్ కుమార్‌ను వీరిద్దరు కిడ్నాప్ చేసి నేరుగా లక్నోలో ఉన్న ఒక బ్లడ్ బ్యాంక్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ అతడి నుంచి రక్తం తీసుకుని అక్కడే అమ్మేసి డబ్బులు తీసుకున్నారు. అంతే కాకుండా అక్కడ ఒక ఇంట్లో నిర్భందించి మొత్తం ఇంటి పని అంతా చేయించుకున్నారు. నాలుగు రోజుల తర్వాత నవల్ కుమార్ సోదరుడికి ఫోన్ చేసి తమకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం చెల్లించాలని, లేదంటే నవల్ కుమార్‌ను హత్య చేసి నదిలో పడేస్తామని చెప్పారట. పోలీసులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారట.
యూపీ పోలీసులు...
నవల్ కుమార్ సోదరుడు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పడంతో పాటు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మెల్లగా పోలీసులు రంగంలోకి దిగి మొత్తం తీగ లాగి డొంక పట్టుకుని కిడ్నాప్ గ్యాంగ్ గుట్టు రట్టు చేయడంతో పాటు, కిడ్నాప్ కి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందట. మొబైల్ ఈఎంఐ కట్టడం లేదని కిడ్నాప్ చేయడం ఏంటి అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. నవల్ కుమార్ ను నాలుగు రోజులు తీవ్రంగా వేదించడంతో పాటు, దాడికి పాల్పడటంతో గాయాలు అయ్యాయని, అలాగే నీరసంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ కేసు వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా చేస్తారా, యూపీలో ఇంకా ఇంతటి దుర్మార్ఘులు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.