ప్రగతిభవన్ తో షాకులు షురూ.. తాజా టార్గెట్ ఎర్రవెల్లి.. రేవంత్ ఆటే వేరు!

ఆట ఏదైనా.. ప్రత్యర్థి బలహీనతలే.. వారిని దెబ్బ తీయాలని భావించే వారి అస్త్రాలు. రాజకీయాల్లో ఇలాంటివి మరింత కరకుగా ఉంటాయి.

Update: 2026-09-18 05:30 GMT

ఆట ఏదైనా.. ప్రత్యర్థి బలహీనతలే.. వారిని దెబ్బ తీయాలని భావించే వారి అస్త్రాలు. రాజకీయాల్లో ఇలాంటివి మరింత కరకుగా ఉంటాయి. అందుకు నిదర్శనంగా సీఎం రేవంత్ పొలిటికల్ గేమ్ చూస్తే అర్థమవుతుంది. తాను టార్గెట్ చేసిన ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. భవిష్యత్తులో వారు ఉక్కపోతకు గురయ్యేలా చేసే నేర్పు ఆయన సొంతంగా చెబుతారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆయన తీరు.. ఇప్పుడు పీక్స్ కు చేరిందన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ముఖ్యమంత్రి హోదాలో ఎంతో మురిపెంగా కట్టించుకున్న ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్. అందులోని ఎంట్రీ ఎంత పరిమితమో అందరికి తెలిసిందే. అలాంటి ప్రగతి భవన్ ను తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి.. దాని పేరును ప్రజాభవన్ గా మార్చేయటమే కాదు.. అందులోని ఇళ్లను ఎలా పంపిణీ చేశారో అందరికి తెలిసిందే.

ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారటమే కాదు.. ఆయన చేసిన కేటాయింపుల తర్వాత.. రాజకీయ వర్గాల్లో నడిచిన చర్చ మొత్తం.. తర్వాతి కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా.. తాను ఇష్టంగా కట్టించిన ఇంట్లో ఉండలేనట్లుగా రేవంత్ నిర్ణయాలు ఉన్నాయన్న మాట బలంగా వినిపించింది. గులాబీ బాస్ మైండ్ సెట్ తెలిసిన వారు ఎవరైనా.. రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని చూసి.. వామ్మో.. వీడు మామూలోడు కాదన్న మాట వచ్చిన పరిస్థితి. ఏం చేస్తే కేసీఆర్ కు మండుతుందో.. తాను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే గులాబీ బాస్ కు అస్సలు రుచించదో.. ఆ విషయాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా డిగ్రీ చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చేయటం ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ కు తొలి షాకిచ్చిన రేవంత్ రెడ్డి తాజాగా ఆయన ఎర్రవెల్లి ఫాంహౌస్ మీద పెట్టిన ప్రత్యేక ఫోకస్.. తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రకటన చూస్తే..తన నిర్ణయాలతో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేయటంలో రేవంత్ నేర్పు మరోసారి చర్చగా మారింది. ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం ఉండే వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి ఉందన్నది సీఎం రేవంత్ మాట. అంతేకాదు.. ఎంత ప్రభుత్వ భూమి ఉందన్న లెక్కలు తీయాలని.. అందుకు నెల రోజులు గడువు పెట్టి.. రెవెన్యూ వర్గాలు ఆ లెక్కల చిట్టా రిపోర్టు రూపంలో ఇవ్వాలని ఆదేశించటం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే సీఎం రేవంత నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది. వ్యవసాయక్షేత్రంలో కలిసి ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించినంతనే.. వాటిని దళితులకు కేటాయించి.. తానే స్వయంగా పట్టాలు ఇస్తానని చెప్పటం ద్వారా.. కేసీఆర్ కు మరోషాక్ ఇవ్వటం తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే.. ప్రగతిభవన్ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారో.. తాజాగా వ్యవసాయ క్షేత్రం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని.. దళితులకు పట్టాల రూపంలో అందజేస్తానన్న మాట గులాబీబాస్ ను ఇరిటేట్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News