అలా కుదరదు...సీఎం విజయ్ కి సుప్రీంకోర్టు స్పష్టం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి సుప్రీం కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. హిందీ బోధన వద్దు అన్నది కుదరదని స్పష్టం చేసింది.

Update: 2026-09-18 03:55 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి సుప్రీం కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. హిందీ బోధన వద్దు అన్నది కుదరదని స్పష్టం చేసింది. తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం తగదని కూడా పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే నవోదయా పాఠశాలలో త్రి భాషా సూత్రాన్ని అమలు చేయడాన్ని అడ్డుకోవద్దని సూచించింది. ఈ విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు దిశా నిర్దేశం చేసింది.

నవోదయ విద్యా సంస్థల మీద :

దేశమంతా నవోదయా విద్యా సంస్థలు కేంద్రం నడుపుతోంది. ప్రతీ రాష్ట్రం విద్యా సంస్థలు ఎక్కువగా ఏర్పాటు కావాలని కోరుకుంటాయి. అలాగే ప్రతీ జిల్లాలో వీటిని కేంద్రం స్థాపిస్తోంది. అయితే నవోదయ పాఠశాలలో త్రిభాషా సూత్రం అమలు చేస్తారు. దాని ప్రకారం హిందీ విద్యా బోధన ఉంటుంది. ఇక్కడే తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. తమిళనాడు గడ్డ మీద హిందీ విద్యా బోధన వద్దు అంటున్న విజయ్ సర్కార్ కి ఇప్పుడు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. హిందీ వద్దు అంటే కుదరదని ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలని కోరింది.

మూడు నెలల గడువు :

తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి అక్కడ ప్రతీ జిల్లాలో స్థలాలను గుర్తించాలని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. నవోదయ పాఠశాల వల్ల తమిళనాడులో విద్యా ప్రమాణాలు తగ్గిపోవని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర సమాఖ్య స్పూర్తితో ఉండాలని కోరింది.

దూరం పెంచొద్దు :

తమిళనాడు వాసులకు ఢిల్లీ ప్రజలను ఒదూరం చేయడం అన్నది తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచింది. ఈ విషయంలో విజయ్ ప్రభుత్వం సరైన ఆలోచనలు చేయాలని కోరింది. ఇక తమిళనాడులో నవోదయ విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరం అయిన స్థలాల గుర్తింపు కోసం కోసం తమిళనాడు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తూ ఈ కేసు విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఇక భాషా విధానం మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రంతో చర్చించుకోవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం విశేషం.

ఎందుకిలా :

ఇదిలా ఉంటే తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అయి నాలుగు నెలలు అయింది. హిందీ వ్యతిరేకత ద్రవిడ పార్టీల నుంచి ఉన్నదే. ఇపుడు టీవీకే ప్రభుత్వం కూడా ద్రవిడ భావజాలాన్ని అనుసరిస్తోంది అన్న చర్చ సాగుతోంది. ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న తమిళం, ఇంగ్లీష్ అనే ద్విభాషా విధానానికే టీవీకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. టీవీకే తన సిద్ధాంతకర్తలలో ద్రవిడ ఉద్యమ పితామహుడు తంతై పెరియార్‌ను ఒకరిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం వంటి ద్రవిడ రాజకీయాల మూల సూత్రాలను విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు గా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తోందని, ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని టీవీకే బహిరంగంగానే ఖండించింది. మొత్తం మీద సుప్రీంకోర్టు సూచనలతో అయినా నవోదయ పాఠశాల విషయంలో విజయ్ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News