బ్యాలెన్స్ మిస్ అయితే ఎలా కేటీఆర్?

రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు.. ఆరోపణలు సహజం. ఇలాంటి వేళలో విమర్శలకు ప్రతి విమర్శలు.. ఆరోపణలకు.. ప్రత్యారోపణలు.. వివరాలు ఇవ్వటం మామూలే.

Update: 2026-09-18 04:35 GMT

రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు.. ఆరోపణలు సహజం. ఇలాంటి వేళలో విమర్శలకు ప్రతి విమర్శలు.. ఆరోపణలకు.. ప్రత్యారోపణలు.. వివరాలు ఇవ్వటం మామూలే. అయితే.. ప్రత్యర్థి తమపై చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే వేళలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి. ఈ విషయంలో బ్యాలెన్స్ మిస్ అయితే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు.. తమపై సంచలన ఆరోపణలు చేసినప్పుడు.. దానికి సమాధానం చెప్పే క్రమంలో సెటిల్డ్ గా.. తిరిగి ప్రశ్నలు సంధించేలా వివరాలు ఉండకూడదు. ఈ ప్రాధమిక సూత్రాన్ని కేటీఆర్ మిస్ అయ్యారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల భూములు వచ్చాయని.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించారని..రూ.లక్ష కోట్ల ఆస్తిని పోగేశారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన సంచలన ఆరోపణల వేళ.. వాటిపై కౌంటర్ ఇచ్చేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు కొత్త క్వశ్చన్లకు కారణం కావటం గమనార్హం. 1954లోనే తమకు వందల ఎకరాలు ఉన్నట్లుగా ఆయన చెప్పటం బాగున్నా.. 2004 ఎన్నికల సమయంలో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో తనకు భూములు సున్నాగా పేర్కొనటాన్ని ప్రశ్నిస్తున్న వైనానికి.. కేటీఆర్ కౌంటర్ కు సింక్ కాకపోవటం గమనార్హం.

72 ఏళ్ల వయసులో 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకోవటం తప్పా? అంటూ ప్రశ్నించటం బాగానే ఉన్నా..ఎగువ మానేరు ప్రాజెకటు ముంపు కింద కోల్పోయిన భూములకు వచ్చిన పరిహారంతోనే కేసీఆర్ తండ్రి వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని.. మంత్రిగా ఉన్నప్పుడు చింతకమడకలో ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేసేవారని గుర్తు చేశారు. అలాంటప్పుడు నాటి అఫిడవిట్ లో వ్యవసాయ భూమి ఉన్నట్లు కేసీఆర్ ఎందుకు చూపించలేదు? అన్న ప్రశ్న వద్ద కేటీఆర్ వాదన తేలిపోతుందన్న మాట వినిపిస్తోంది. వనపర్తిలో గోడల మీద రాతలు రాసే స్థాయి నుంచి జూబ్లీహిల్స్ లో ప్యాలెస్ లు నిర్మించుకునే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారంటూ కౌంటర్ ఆరోపణలు చేశారు కేటీఆర్.

ముఖ్యమంత్రి కావటానికి ముందు నుంచే జూబ్లీహిల్స్ లో రేవంత్ కు ఇల్లు ఉండటం.. అదేమీ ప్యాలెస్ ను తలపించేలా లేకపోవటం లాంటివి కేటీఆర్ చేసే ఘాటు విమర్శల స్థాయిని తగ్గిస్తాయన్న మాట వినిపిస్తోంది. సోదరుడు, బావమరిదికి ఉన్న వందలాది ఎకరాల భూకుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవటానికే ధరణిని రద్దు చేసి భూభారతిని తెచ్చారని ఆరోపిస్తున్న వేళ.. సహజంగానే కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ధరణి.. ఎవరి భూములు కప్పిపుచ్చుకోవటానికి తీసుకొచ్చారన్న ప్రశ్న రావటం సహజం కదా? మరీ.. ఇంత పేలవంగా తన వాదనను వినిపించటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంట్లో పుట్టినా.. ప్రస్తుతం హైదరాబాద్ లో తమ కుటుంబం మొత్తం కలిసి ఉండటానికి సరైన ఇల్లు లేదన్న కేటీఆర్ మాటలు బాగానే ఉన్నా.. ఆయన చెప్పిన అదనపు వివరాలు కొత్త ప్రశ్నలకు కారణమయ్యేలా మారాయి. అందుకు నిదర్శనంగా తాను అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి.. అక్కడే ఆరున్నరేళ్లు ఉద్యోగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి.. అంతకాలం అమెరికాలో ఉద్యోగం చేసినప్పుడు హైదరాబాద్ లో మంచి ఇంటిని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఓవైపు సొంతూర్లో రెండు ఎకరాల్లో ఇల్లు ఉన్నప్పుడు.. కేటీఆర్ అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు.. హైదరాబాద్ లో నంది హిల్స్ లోని ఇరుకు ఇంటిని వదిలేసి.. విశాలమైన ఇంటిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇప్పటి మాదిరి హైదరాబాద్ లో ఇళ్ల ధరలు కేటీఆర్ అమెరికాలో జాబ్ చేసే నాటికి అస్సలు లేవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తమపై సూటిగా.. స్పష్టంగా చేసిన భూముల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేటప్పుడు.. కేటీఆర్ వాటి వరకు పరిమితం అవుతూ.. తాను టార్గెట్ చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారి కుటుంబ సభ్యులకు ఉన్న భూముల వివరాలు.. అవెప్పుడు వచ్చాయి? ఎలా వచ్చాయన్న వివరాలను ప్రకటించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. తాను వెల్లడించిన వివరాలే తమను ఇరుకున పడేలా.. పలు ప్రశ్నలు తెర మీదకు వచ్చేలా చేయటం చూసినప్పుడు.. సెటిల్డ్ గా ఉండాల్సి వేళ.. బ్యాలెన్స్ మిస్ అయ్యారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News