బొత్సకు చెప్పకుండా నియామకం...అక్కడ వైసీపీ సంగతేంటి ?
సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉత్తరాంధ్రా జిల్లాల పెద్ద దిక్కుగా చెబుతారు.
సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉత్తరాంధ్రా జిల్లాల పెద్ద దిక్కుగా చెబుతారు. ప్రత్యేకించి విజయనగరం జిల్లా రాజకీయాల మీద ఆయన ముద్ర బలంగా ఉంటుంది. అక్కడ చీమ చిటుక్కుమన్న కూడా ఆయనకు తెలిసిపోతుంది. ఇక కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా బొత్స కనుసన్నలలోనే రాజకీయాలు సాగుతాయి. పార్టీలు పేరుకు మాత్రమే. బొత్స ఆలోచనల మేరకే జిల్లా స్థాయిలో నియామకాలు కానీ ఉద్వాసనలు కానీ జరుగుతాయి. ఆయన జోక్యం లేకుండా ఏ నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ తీసుకోలేదు, ఇప్పటిదాకా వైసీపీ హైకమాండ్ కూడా ఆ పని చేయలేదు. కానీ తొలిసారి బొత్సకు చెప్పకుండా ఒక కీలక నిర్ణయమే పార్టీ తీసుకుంది. అదే నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడుని నియమిస్తూ వైసీపీ హైకమాండ్ సడెన్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా జిల్లా రాజకీయాల్లో ఉంది.
జగన్ కి అభిమానిగా :
ఇంతకీ ఈ గదల సన్యాసినాయుడు ఎవరు అంటే మూడున్నర పదుల వయసు కలిగిన యువ నాయకుడు. రెండు సార్లు జెడ్పీటీసీగా గెలిచారు. మొత్తం నాలుగు మండలాలు ఉన్న నెల్లిమర్లలో రెండు మండలాల మీద పట్టున్న నేత. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక రాజకీయంగా పెద్దల అండదండలు లేని సామాన్య నాయకుడు. జగన్ అభిమానిగా ఉంటూ అధినేత వద్ద మంచి మార్కులు సాధించారు. ఇపుడు ఆయనకు నేరుగా జగన్ ఇంచార్జి బాధ్యతలు కట్టబెట్టారు. క్యాడర్ తో మమేకం అయ్యే ఈ యువ నేతకు ఆర్ధికంగా బలం లేదు, అయితే తానే దగ్గరుండి అన్నీ చూసుకుని గెలిపించి తీరుతాను అని అధినాయకత్వం హామీ ఇచ్చి మరీ ఇంచార్జి పదవిలో కూర్చోబెట్టింది అని అంటున్నారు.
బొత్సకు తెలియదా :
ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే జిల్లా పెద్దగా ఉన్న బొత్సకు ఈ నియామకం తెలియదు అని అంటున్నారు. పైగా నెల్లిమర్ల వైసీపీ ఇంచార్జిగా ఉంటూ 2019 ఎన్నికల్లో గెలిచిన బడుకొండ అప్పలనాయుడు కూడా బొత్స బంధువు. ఆయన తన వియ్యంకుడు చిన్న శ్రీను పార్టీ మారినా తాను విధేయంగా ఉంటాను అని చెప్పిన రోజే ఈ భారీ షాక్ ని అధినాయకత్వం ఇచ్చింది. ఇక బొత్స విషయానికి వస్తే ఆయన బడ్డుకొండనే కొనసాగించి చూడాలని అనుకున్నారని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఈ నియామకం జరగడంతో బొత్స వర్గంలో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. బొత్స బంధువులే నెల్లిమర్ల గజపతినగరంలో ఎమ్మెల్యేలు అవుతున్నారు. చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇక విజయనగరం ఎంపీ పదవికి కూడా ఆయన బంధువులే పోటీ చేస్తున్నారు. ఇంతలా హవా చాటుకుంటున్న బొత్సకి తెలియకుండా ఈ నియామకం జరగడమేంటని అంటున్నారు.
మీటింగ్ వాయిదా :
ఇక చూస్తే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. నెల్లిమర్లలో కూడా నిర్వహించాల్సి ఉంది. బడ్డుకొండ ఇంచార్జిగా ఉంటే ఈపాటికి జరిగేది. కానీ ఆయన్ని తప్పించారు. గదల సన్యాసినాయుడు కొత్త ఇంచార్జి అయ్యారు. దాంతో ఇక్కడ నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం వాయిదా పడింది అని అంటున్నారు. ఇక చూస్తే నెల్లిమర్లలో బొత్స అనుచర వర్గం బలంగా ఉంది. వారిని కాదని గదల సన్యాసినాయుడు ముందుకు సాగగలరా అన్నది చర్చగా ఉంది. హైకమాండ్ ఆయనకు ఎంత మద్దతుగా నిలిచినా జిల్లా పెద్దల ఆశీస్సులు నిండుగా ఉండాలని అంటున్నారు. మొత్తంగా చూస్తే బొత్స ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీదనే తదుపరి అంశాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.