సర్ ముసాయిదా...45 లక్షల ఓట్ల సంగతేంటి ?

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్ ముసాయిదా విడుదల అయింది. ఎన్నికల సంఘం దీనిని పబ్లిక్ డొమైన్ లో పెట్టింది.

Update: 2026-07-31 18:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్ ముసాయిదా విడుదల అయింది. ఎన్నికల సంఘం దీనిని పబ్లిక్ డొమైన్ లో పెట్టింది. ప్రజల ముందు ఉంచింది. ఈ జాబితాలో ఓటర్లుగా ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి వీలు కల్పించింది. అదే సమయంలో ఏపీలో ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం ఓట్లు చూస్తే జూలై 24 నాటికి ఉన్న 4 కోట్ల 16 లక్షల 27 వేల 694 మంది ఓటర్లలో మొత్తం 3 కోట్ల 71 లక్షల 38 వేల 182 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించారని అధికారులు చెప్పారు. అంటే వీరు ముసాయిదాలో ఉన్న ఓటర్లు అన్న మాట. మరి మిగిలిన వారు ఓట్ల సంగతి ఏంటి అన్నది ప్రశ్నగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కనుక దాదాపు 45 లక్షల మంది ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ లెక్క అంటూ :

ఇలా తొలగించిన ఓట్లలో తమ నివాసాలను ఏకంగా వేరే చోటుకు మార్చిన వారు ఉన్నారు. అలాగే అందుబాటులో లేని వారు చూస్తే 22.30 లక్షల మంది ఉన్నారు. మృతి చెందిన 15.22 లక్షల మంది ఉంటే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇక డెత్ అయిన ఓట్లను పక్కన పెడితే మిగిలిన ఓట్లలో తమకు ఓటు హక్కు ఉన్నా జాబితాలో పేరు లేదని భావించే వారు అయితే వారికి ఒక అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకూ వీరంతా తమ అభ్యంతరాలు, దాఖలు చేసేందుకు కాలంలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించి మళ్లీ ఓటరు జాబితాలో పేరును జోడించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లను కేవలం ఒక్కచోట మాత్రమే ఉంచుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

షెడ్యూల్ ఈ విధంగా :

ఓటు హక్కు కోసం అర్హత ఉన్న వారు చేసుకునే అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు నిర్వహిస్తారు. తుది ఓటర్ల జాబితా విడుదల అక్టోబర్ 3న ప్రకటిస్తారు. ఇక కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6తో పాటు, గుర్తింపు, వయసు, చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, యుటిలిటీ బిల్లు వంటి పదకొండు రకాల ఐడెంటిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. . డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత అభ్యంతరాలను పరిష్కరించడానికి ఈ పత్రాలు ఉపయోగపడతాయి. అందువల్ల ఓట్లు పోయాయి అని ఎవరూ కంగారు పడాల్సినది లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తమ ఓటుని వారు కలిగి ఉన్నట్లుగా తాము అర్హులమే అన్నట్లుగా రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఎవరైతే ముసాయిదా జాబితాలో ఓటర్లుగా పేర్లు నమోదు కాలేదో వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఒక్కసారిగా అంటే అక్టోబర్ 3న తుది జాబితా కనుక వెలువడితే ఓటర్ల జాబితాలో పేరు అయితే చేర్పించే చాన్స్ అయితే ఉండదు అని చెబుతున్నారు. దాంతో ఈ నెల రోజుల సమయాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News