ఉద్ధండుల వార‌సులు: వీరి గురించి మ‌రిచిపోవాల్సిందేనా.. ?

రాజ‌కీయ ఉద్ధండులుగా చ‌క్రం తిప్పిన వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయితే..వారి శ‌కం ముగిసిన త‌ర్వాత‌.. వారి వార‌సులను రంగంలోకి తీసుకురావాల‌ని భావించారు.

Update: 2026-07-31 23:30 GMT

రాజ‌కీయ ఉద్ధండులుగా చ‌క్రం తిప్పిన వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయితే..వారి శ‌కం ముగిసిన త‌ర్వాత‌.. వారి వార‌సులను రంగంలోకి తీసుకురావాల‌ని భావించారు. కానీ, ఒక‌రిద్ద‌రు మిన‌హా.. పెద్ద గా ఎవ‌రూ స‌క్సెస్ కాలేక పోయారు. దీంతో ఉద్ధండుల వార‌సుల రాజ‌కీయం దాదాపు ముగిసిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొత్త త‌రం నాయ‌కులు పెరుగుతున్న నేప‌థ్యంలో వీరికి బ‌ల‌మై న పోటీ ఇచ్చే స్థాయిలో వార‌సులు లేక‌పోవ‌డం.. మ‌రోవైపు ప్ర‌జ‌ల బ‌లం మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌డంలోనూ వెనుక‌బ‌డ‌డం వంటివి చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

గ‌తంలో మంత్రులుగా సీనియ‌ర్ నాయ‌కులుగా ప‌నిచేసిన దాడి వీర‌భ‌ద్ర‌రావు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, వంగ‌వీటి రంగా, గాదె వెంక‌ట‌రెడ్డి, గ‌ల్లా అరుణ కుమారి.. ఇలా.. అనేక మంది నాయ‌కులు త‌మ‌దైన పాత్ర‌ను పోషించారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై త‌మ‌దైన ముద్ర కూడా వేసుకు న్నారు. అయితే.. వారి వార‌సులుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా.. పెద్ద‌గా స‌క్సెస్ అయిన వారు లేరు. గుంటూరుగా ఎంపీగా రెండు సార్లు గెలిచిన అరుణ‌కుమారి కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్ పూర్తిగా ఇప్పుడు వ్యాపారానికే ప‌రిమితం అయ్యారు.

ఇక‌, ఎంపీగా త‌న‌దైన ముద్ర వేసిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు.. రాయ‌పాటి శ్రీనివాస‌రావు కూడా రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పారు. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న మౌనం పాటిస్తున్నారు. ఇక‌, కోడెల వార‌సుడు.. కోడెల శివ‌రామ కృష్ణ కూడా రాజ‌కీయంగా ఇటీవ‌ల కాలంలో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. పైగా.. స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఆయ‌న పోటీ చేయాల‌ని అనుకున్నా.. ఆ స్థానం ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌క‌పోవ‌డంతో వైద్య వృత్తిలోనే ఉన్నారు.

ఇక‌, కాపు ఉద్య‌మ నేత రంగా వార‌సుడు వంగ‌వీటి రాధా ప‌రిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఆయ‌న కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న వాయిస్ కూడా వినిపించడం లేదు. 2004లో ఒకే ఒక్క‌సారి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రాధా.. త‌ర్వాత‌.. ప‌రాజ‌యాల బాట ప‌ట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో అల‌సు టికెట్ కూడా ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడు ఆయ‌న పేరు.. ఊరు కూడా ఎక్క‌డా వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, బాప‌ట్ల జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఇటీవ‌ల మృతి చెందిన గాదె వెంక‌ట‌రెడ్డి కుమారుడు మ‌ధు సూద‌న్‌రెడ్డి తొలినాళ్ల‌లో వైసీపీలో చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న ఊహించిన‌ట్టుగా వైసీపీ రాజ‌కీయం కొన‌సాగలేదు. దీంతో సైలెంట్ అయిపోయారు. ఇలా.. చాలా మంది ఉద్ధండుల వారసులు చ‌రిత్ర‌లో క‌లిసిపోయార‌న‌డంలో సందేహం లేదు. రాబోయే త‌రం పెరుగుతుండ‌డం.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో వార‌సులు వ్యాపారాల‌కే ప‌రిమితం అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది.

Tags:    

Similar News