భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ...ఏ పార్టీ నుంచి ?
భూమా మౌనిక రెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయం అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సినీ నటుడు ఆమె భర్త మంచు మనోజ్ వెల్లడించారు.
భూమా మౌనిక రెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయం అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సినీ నటుడు ఆమె భర్త మంచు మనోజ్ వెల్లడించారు. భూమా మౌనికా రెడ్డికి రాజకీయాలు కొత్త కాదని ఆయన చెప్పుకొచ్చారు. భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఆమె భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అని మనోజ్ సంచలన ప్రకటన చేశారు. దీంతో రాయల సీమ రాజకీయాలతో పాటు కర్నూల్ ఆళ్ళ రాజకీయాల్లో కొత్త చర్చ వేడిగా వాడిగా రాజుకుంటోంది.
భూమా సొంత గడ్డ :
విషయానికి వస్తే భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఆ కుటుంబం జిల్లాలో కీలక పాత్ర పోషించింది. భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతులు రాజకీయాల్లో తమదైన శైలిలో ప్రాధాన్యతతో కూడిన పాత్ర పోషించారు. వారు దివంగతులు కావడంతో ఆ కుటుంబంలో బిడ్డలు ఇపుడు రాజకీయంగా తమ అవకాశాల కోసం ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డి దంపతుల రాజకీయ వారసురాలిగా రంగ ప్రవేశం చేసిన అఖిల ప్రియ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆళ్ళగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఉంటూ గట్టి పట్టు సాధించారు.
చెల్లెలు సైతం సై :
ఇదిలా ఉంటే భూమా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె మౌనిక రెడ్డి ఇప్పుడు రాజకీయాల వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు అని అంటున్నారు. మంచు మనోజ్ ఈ విషయాని ధృవీకరించడంతో పాటు మౌనికా రెడ్డిది రాజకీయ కుటుంబమే అని స్పష్టం చేయడంతో భూమా మౌనిక రెడ్డి రాజకీయానికి తెర లేచినట్లు అయింది. భూమా కుటుంబంలో ఇద్దరు ఆడబిడ్డలు ఒక సోదరుడు రాజకీయ వారసత్వం విషయంలో పోటీ పడే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. అయితే అఖిలప్రియకు గతంలో మౌనికా రెడ్డి రాజకీయంగా అండగా నిలిచి ఆమె విజయం వెనక ఉన్నారు. ఇక వారి సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి కూడా అఖిలప్రియ వెంట ఉన్నారు. మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమె దారి ఏ వైపు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
ఏ పార్టీ నుంచి అంటే :
ఇక భూమా మౌనిక రెడ్డి రాజకీయంగా తన సొంత దారిలో వెళ్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆమెకు మంచు మనోజ్ పూర్తి మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దంపతులు ప్రజల మన్నన పొందుతున్నారు. రాజకీయాలు పట్ల ఆసక్తి కూడా ఉన్నట్లుగా ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగ ప్రవేశం మీద తాజాగా కీలక వ్యాఖ్యలే చేశారు. దాంతో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏది పార్టీ నుంచి చేస్తారు, ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా ఇవన్నీ చర్చకు దారి తీస్తున్నాయి.
అన్ని పార్టీలతోనూ :
ఇక భూమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతోనూ వైసిపితోనూ ప్రజా రాజ్యంతోనూ సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు ఈ మూడు పార్టీల నుంచి ప్రజా ప్రతినిదులు అయ్యారు. దాంతో తెలుగుదేశంలో అక్క అఖిలప్రియ రాజకీయంగా స్థిరపడినందున మౌనికా రెడ్డి వేరే ప్రత్యామ్నాయలు చూసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజారాజ్యంలో భూమా దంపతులు పనిచేసిన కారణంగా జనసేనలో ఏమైనా అవకాశం సంపాదించి అక్కడ నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా మరొక చర్చగా ఉంది. ఏది ఏమైనా భూమా మౌనిక రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం మాత్రం కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్తగా సంచలన కలిగించే అవకాశం ఉంది. అక్క చెల్లెలు ఇద్దరూ సర్దుబాటు రాజకీయంగా ముందుకు సాగుతారా లేక ఎదురు బొదురు నిలిచి పోటీ చేస్తారా, అది కూడా వేరు వేరు పార్టీ నుంచి రాజకీయంగా ముందుకు వస్తారా అన్నది సైతం చూడాల్సి ఉంది. భూమా కుటుంబ వారసత్వం ఎవరిది అన్న ప్రశ్నకు జవాబుగా అఖిల ప్రియా ఉన్నారు. మరి పోటీగా మౌనిక రెడ్డి వస్తే మాత్రం రాజకీయం ఆళ్లగడ్డ నుంచి కర్నూలు జిల్లా వరకు రసకందాయంలో పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.