వదిలి పెట్టను.. కోర్టుకు వెళ్తా: కవిత డెసిషన్
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. తను పెట్టుకున్న కొత్త పార్టీకి టీఆర్ ఎస్ పేరును నిరాకరిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాఖీదులపై ఆమె స్పందించారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. తను పెట్టుకున్న కొత్త పార్టీకి టీఆర్ ఎస్ పేరును నిరాకరిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాఖీదులపై ఆమె స్పందించారు. ఈ వ్యవహా రాన్ని ఇక్కడితో వదిలేసి లేదని ఆమె స్పష్టం చేశారు. దీనివెనుక కుట్రలు జరుగుతున్నాయని.. గతంలో కోర్టుకు వెళ్లిన తర్వాతే.. తమకు టీఆర్ ఎస్ పేరు వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా తాముకోర్టును ఆశ్రయిస్తామని కవిత వెల్లడించారు.
బీఆర్ ఎస్‌పై పరోక్షంగా..
ఈ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీపై కవిత పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు ఎవరు పంపించారో తనకు తెలుసునని కవిత చెప్పారు. ఇవన్నీ.. తాము నిశితంగా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల సంఘ ఒత్తిడి చేసినట్టుగా తాము వ్యవహరించలేమన్నారు. పార్టీ విషయంపై తాము ఇప్పటికే పలు వివరణలు ఇచ్చామని కవిత చెప్పారు. అయినప్పటికీ పేరును తిరస్కరించడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి విజయం దక్కించుకున్నామని తెలిపిన కవిత.. మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
పేరుతోనే గుర్తింపా?
ఇదిలావుంటే, ఈ మొత్తం వివాదంలో కవిత `పేరు` కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ ఎస్ పేరుతో నే తనకు మైలేజీ వస్తుందన్న భావనలోనే ఆమె ఉన్నట్టు తెలుస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో బీఆర్ ఎస్ కంటే కూడా.. టీఆర్‌ఎస్ పేరుకే ప్రధానంగా గుర్తింపు ఉంది. ఈ పేరుతోనే ప్రజలకు పార్టీ కూడా పరిచయం అయింది. దీంతో ఇప్పుడు పార్టీ పేరుతోనే ముందుకు సాగాలన్నది కవిత ఆలోచన. అందుకే .. ఆ పేరు కోసమే పట్టుబడుతున్నారన్న వాదన ఉంది. కానీ.. పేరుకంటే కూడా.. ఇమేజే రాజకీయాల్లో నాయకులకు దోహదపడుతుంది. ఈ విషయంలో కవిత పునరాలోచన చేయాలని కొందరు సూచిస్తున్నారు.