హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్.. "మాఫియా నైట్స్"తో ఒత్తిడికి చెక్

అదే "మాఫియా నైట్స్". కేవలం వీకెండ్స్‌లోనే కాకుండా.. వర్క్ అవర్స్ ముగిసిన తర్వాత కూడా ఈ సరికొత్త గేమ్ సెషన్లు టెక్కీలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Update: 2026-07-04 11:17 GMT

బయట నుంచి చూసేవారికి ఐటీ ఉద్యోగం అంటే హై-ఫై లైఫ్‌స్టైల్, భారీ జీతాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల ఉండే ఉద్యోగులకు మాత్రమే తెలుసు ఆ డెడ్‌లైన్లు, టార్గెట్లు, కంటిన్యూస్ మీటింగ్‌లు, కార్పొరేట్ పాలిటిక్స్ తెచ్చే మానసిక ఒత్తిడి ఎలాంటిదో.. నిత్యం కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోయి మెదడుకు తీవ్రమైన పనిచెప్పే టెక్కీలు.. ఆ స్ట్రెస్‌ను దూరం చేసుకోవడానికి ఒకప్పుడు జిమ్‌లు, వీకెండ్ ట్రిప్‌లు, పబ్‌లను ఆశ్రయించేవారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే "మాఫియా నైట్స్". కేవలం వీకెండ్స్‌లోనే కాకుండా.. వర్క్ అవర్స్ ముగిసిన తర్వాత కూడా ఈ సరికొత్త గేమ్ సెషన్లు టెక్కీలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఇంతకీ ఏంటి ఈ "మాఫియా నైట్స్"?

పేరు వినగానే ఇదేదో క్రైమ్ నెట్‌వర్క్ అనుకుంటే పొరపాటే.. ఇది పూర్తిగా మైండ్ గేమ్‌లతో కూడిన ఒక సోషల్ గ్రూప్ యాక్టివిటీ. సాధారణంగా 10 నుండి 24 మంది వరకు సభ్యులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈ గేమ్ ఆడుతుంటారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకమైన కల్పిత పాత్రలను కేటాయిస్తారు.

మాఫియా డాన్ , గ్యాంగ్ అంటూ వీరు రహస్యంగా గ్రూప్‌లోని ఇతరులను ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. పోలీస్ , డిటెక్టివ్ లంటూ మాఫియా ముఠా ఎవరో కనిపెట్టే బాధ్యత వీరిది. డాక్టర్ రోల్ అనేది బాధితులను కాపాడే పాత్ర. సాధారణ పౌరులు తమ లాజికల్ థింకింగ్‌తో అసలైన నేరస్థులను పట్టుకోవాల్సి ఉంటుంది.

ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తంచేస్తూ, ఒకరినొకరు బ్లఫ్ చేసుకుంటూ, తీవ్రమైన చర్చలు, లాజికల్ ఆర్గ్యుమెంట్లతో ఈ గేమ్ సాగుతుంది. ఇందులో గెలుపోటముల కంటే.. ఆడే విధానం, అందులో ఉండే సస్పెన్స్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి.

నైపుణ్యాలకు పదును.. నెట్‌వర్కింగ్‌కు ప్లస్

ఈ గేమ్ కేవలం టైమ్‌పాస్ వినోదం మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగుల్లోని వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ గేమ్ ఆడటం వల్ల టీమ్‌వర్క్ ,కమ్యూనికేషన్ పెరుగుతుంది. సహోద్యోగులతో లేదా కొత్త వ్యక్తులతో సమర్థవంతంగా మాట్లాడటం, టీమ్‌గా పనిచేయడం అలవాటవుతుంది. అవతలి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అని వారి బాడీ లాంగ్వేజ్ ఆధారంగా పరిశీలించే నైపుణ్యం పెరుగుతుంది. గంటల తరబడి కోడింగ్, ప్రెజెంటేషన్ల మధ్య నలిగిపోయే మైండ్‌కు ఇది పూర్తి విరామాన్ని ఇచ్చి, ఒత్తిడిని మాయం చేస్తుంది.

ఐటీ హబ్‌లలో జోరుగా ఈవెంట్స్

ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వంటి ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఈ "మాఫియా నైట్స్" ట్రెండ్ జోరుగా సాగుతోంది. కొందరు ఐటీ ఉద్యోగులు తమ ఫ్రెండ్స్ సర్కిల్‌తో ప్రైవేట్‌గా కెఫేలలో లేదా ఫ్లాట్స్‌లో ఈ గేమ్స్ అరేంజ్ చేసుకుంటుంటే.. మరికొందరు ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్ల ద్వారా ఈ సెషన్లలో జాయిన్ అవుతున్నారు.

పెరుగుతున్న ఈ డిమాండ్‌ను బట్టి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా "మాఫియా నైట్ క్లబ్స్", కమ్యూనిటీ గ్రూప్స్ కూడా వెలుస్తున్నాయి. వారాంతాల్లో ఎలాంటి ఆల్కహాల్, లౌడ్ మ్యూజిక్ లేకుండా.. కేవలం మాటలు, నవ్వులు, మైండ్ గేమ్‌లతో హెల్తీగా ఎంజాయ్ చేయడానికి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా మారిందని టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఐటీ ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం పై అవగాహన పెరుగుతున్న తరుణంలో.. ఇలాంటి వినోదాత్మక, సామాజిక కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ రంగానికి పరిమితమైన ఈ "మాఫియా నైట్స్" ట్రెండ్, మెల్లమెల్లగా ఇతర రంగాల ఉద్యోగులను, యువతను సైతం ఆకట్టుకుంటూ నగరంలో ఒక కొత్త సోషల్ కల్చర్‌కు తెరలేపుతోంది.

Tags:    

Similar News