ఖమేనీ పక్కనే ఏడాదిన్నర చిన్నారి శవపేటిక.. టెహ్రాన్‌లో హృదయాలను కలిచివేస్తున్న దృశ్యాలు
గ్రాండ్ మోసల్లా వద్దకు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే వేలాది మంది ఒకేసారి లోపలికి చేరుకుని ఖమేనీకి తుదివీడ్కోలు పలికారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి నిర్వహిస్తున్న తుదివీడ్కోలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తీవ్ర భావోద్వేగాలను రేకెత్తిస్తున్నాయి. గ్రాండ్ మోసల్లా ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఖమేనీ పార్థివదేహాన్ని ఉంచగా.. ఆయన పక్కనే ఉంచిన ఏడాదిన్నర వయసున్న చిన్నారి శవపేటిక అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాల ప్రకారం.. ఆ చిన్నారి ఖమేనీ 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని అని తెలుస్తోంది. జాతీయ జెండాతో కప్పిన చిన్న శవపేటిక పక్కనే ఆమె ఫొటోను ఉంచడంతో అక్కడికి వచ్చిన ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో జహ్రాతో పాటు ఆమె తల్లి, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన పార్థివదేహాలను ఇప్పుడు ఆరు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ జాతీయ జెండాతో కప్పి, ఆయన ధరించే నల్ల టర్బన్‌ను సంప్రదాయబద్ధంగా తలవద్ద ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను కూడా ప్రత్యేక శవపేటికల్లో ఆయన పక్కనే ఏర్పాటు చేశారు. అందులో చిన్నారి జహ్రా శవపేటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినా, అదే సమయంలో అత్యంత విషాదకర దృశ్యంగా మారింది.
ఈ కార్యక్రమానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. చిన్నారి శవపేటికను చూసిన పలువురు నేతలు, అధికారులు భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
గ్రాండ్ మోసల్లా వద్దకు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే వేలాది మంది ఒకేసారి లోపలికి చేరుకుని ఖమేనీకి తుదివీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అమెరికా వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. ప్రతీకారాన్ని సూచించే ఎరుపు జెండాలు ప్రదర్శించిన కొందరు ఆందోళనకారులు అమెరికాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఆరు రోజుల సంతాప కార్యక్రమాల్లో వివిధ దశల్లో దాదాపు రెండు కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉంది. భారత్, రష్యా, పాకిస్థాన్, టర్కీ సహా సుమారు 100 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరైనట్లు సమాచారం. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సోమవారం వరకు ఖమేనీ పార్థివదేహాన్ని టెహ్రాన్‌లో ఉంచి, అనంతరం పవిత్ర నగరమైన ఖోమ్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కర్బలా, నజాఫ్ ప్రాంతాల మీదుగా ప్రత్యేక సంతాప యాత్ర నిర్వహించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఇరాన్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఖమేనీ పక్కనే ఉంచిన చిన్నారి జహ్రా శవపేటిక ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలిచివేస్తున్న దృశ్యంగా మారింది.