పైరసీకి చెక్… కేంద్రం కఠిన చర్యలు, టెలిగ్రామ్‌కు షాక్!
అక్రమంగా కంటెంట్ ప్రసారం చేస్తున్న సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానళ్లను, వందలాది వెబ్‌సైట్లను గతంలోనే ఐటీ చట్టం ద్వారా నిలిపివేయించారు.
టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్ పైరసీపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ నెట్‌వర్క్‌ను పూర్తిగా అరికట్టేందుకు ఐటీ మరియు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు కలిసి టెలిగ్రామ్ సంస్థకు గట్టి షాక్ ఇస్తూ అధికారికంగా నోటీసులు జారీ చేశాయి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను లీక్ చేస్తున్న ఛానళ్లను తక్షణమే తొలగించాలని, దీనిపై తీసుకున్న కఠిన చర్యలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టెలిగ్రామ్‌కు కేంద్రం 15 రోజుల డెడ్‌లైన్:
పెద్ద ఎత్తున కాపీరైట్ ఉన్న కంటెంట్, ప్రీమియం సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు లింకుల రూపంలో టెలిగ్రామ్‌లో సర్క్యూలేట్ అవ్వడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.ఇక కేవలం లింకులను బ్లాక్ చేయడం మాత్రమే కాదు.. అసలు పైరసీని అడ్డుకునేందుకు ఎలాంటి కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందించారో వివరిస్తూ 15 రోజుల్లోగా ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ ఇవ్వాలని టెలిగ్రామ్‌కు డెడ్‌లైన్ విధించారు.
క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం:
టెలిగ్రామ్ గ్రూపులు, బాట్‌లు మరియు ఛానళ్ల ద్వారా జరుగుతున్న ఈ పైరసీ వల్ల చిత్ర పరిశ్రమతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు మరియు క్రియేటర్స్ ఆర్థికంగా కోట్లలో నష్టపోతున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం.. భారతదేశంలో సినిమా పైరసీ అనేది కేవలం సివిల్ తప్పు మాత్రమే కాదు, ఇది ఒక తీవ్రమైన నేరపూరిత చర్య అని గుర్తు చేసింది.
మేమే చెప్పేదాకా కాదు.. ముందే అడ్డుకోండి:
ప్రభుత్వం ఒక్కో పైరసీ ఛానల్‌ని గుర్తించి చెప్పే వరకు టెలిగ్రామ్ వేచి చూడకూడదు అని కేంద్ర మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. కేవలం ఇక ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే స్పందించే పద్ధతి కాకుండా.. అసలు పైరసీ కంటెంట్ అప్‌లోడ్ అవ్వకుండా మీ వ్యవస్థను ముందే అలర్ట్ చేయాలని హెచ్చరించింది. పదే పదే తప్పులు చేసే అడ్మిన్లు, గ్రూపులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
గతంలోనే 3 వేలకు పైగా ఛానల్స్ క్లోజ్:
ఈ పైరసీ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం గతంలోనే ఉక్కుపాదం మోపింది. అక్రమంగా కంటెంట్ ప్రసారం చేస్తున్న సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానళ్లను, వందలాది వెబ్‌సైట్లను గతంలోనే ఐటీ చట్టం ద్వారా నిలిపివేయించారు. ఇక ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఒక మధ్యవర్తిగా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన పూర్తి బాధ్యత టెలిగ్రామ్ యాజమాన్యానిదేనని, నిబంధనలు పాటించకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.
భారతదేశంలో సినిమా, ఓటీటీ రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ 15 రోజుల గడువులోగా టెలిగ్రామ్ తన సెక్యూరిటీ ఫిల్టర్లను ఎలా బలోపేతం చేస్తుందో చూడాలి. ఇక ఏదేమైనా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ యాంటీ-పైరసీ స్టెప్ వల్ల ఇకపై టెలిగ్రామ్‌లో దొంగచాటుగా సినిమాలు చూసే వారికి గట్టి బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది..