సర్ భయం...వైసీపీ అప్రమత్తం
సర్ అంటే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా. దేశంలో ఇది సర్వ సాధారణంగా సాగుతూ వచ్చే ప్రక్రియ. ప్రతీ ఎన్నికల ముందు నిజానికి చేయాల్సి ఉంది.
సర్ అంటే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా. దేశంలో ఇది సర్వ సాధారణంగా సాగుతూ వచ్చే ప్రక్రియ. ప్రతీ ఎన్నికల ముందు నిజానికి చేయాల్సి ఉంది. అయితే అది ఆయా రాష్ట్రాల స్థాయిలో ఉన్న ఓట్లు ఎన్ని, నకిలీ ఎన్ని ఇలా చూసుకుని జాబితాలను తయారు చేయడానికి పరిమితం అవుతోంది. అయితే ఇంత చేసినా దొంగ ఓట్లు అధికంగా ఉంటున్నాయని భావించి కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగ్ సర్ పేరుతో భారీ ప్రక్రియను చేపడుతోంది. ఇది బీహార్ లో మొదలై ఇపుడు దేశమంతా విస్తరినింది. మూడవ దశలో దాదాపుగా 16 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ మొదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో :
తాజా విడతలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా ఆ పార్టీ అప్రమత్తంగా ఉండాలని అంటోంది. విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా సర్ పేరుతో తమ ఓట్లు పోతే ఊరుకోమని అంటోంది. ఇక ఏపీలో చూస్తే అధికారంలో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది. దాంతో సర్ భయం ఫ్యాన్ పార్టీలో కనిపిస్తోంది. సర్ గురించి ఎందుకు అంత సీరియస్ అంటే దేశంలో ఇంతకు ముందు జరిగిన చోట్ల విపక్షాల ఓట్లు గల్లంతు అయ్యాయని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టిన నేపథ్యం ఉంది. సర్ ప్రక్రియ మీద ఏకంగా బెంగాల్ లాంటి చోట్ల ఆనాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు. దీంతో ఏపీలో అసలే ఈవీఎంల వల్ల తమకు సీట్లూ ఓట్లు భారీగా గల్లంతు అయి గత ఎన్నికల్లో పరాభవం జరిగిందని వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో సర్ విషయం కూడా గట్టిగానే ఉండాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.
ఒక్క ఓటు పోయినా :
సర్ ప్రక్రియలో ఒక్క ఓటు వైసీపీ మద్దతుదారులది పోయినా అది జయాపజయాలను నిర్ణయిస్తుందని భారీ డ్యామేజ్ కలుగుతుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఏకంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సర్ ప్రక్రియ జరిగేటపుడు ఏ విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న దాని మీద బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. అవగాహన కూడా వారికి కల్పించింది. ఏ ఒక్క ఓటు పోయినా తిరిగి చేర్పించడానికి తాతలు దిగి రావాల్సి ఉంటుందని అందువల్ల అంతా పూర్తి నిఘా ఉంచాలని వైసీపీ పెద్దలు హిత బోధ చేస్తున్నారు.
ఇదీ షెడ్యూల్ :
ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వచ్చి ఎన్నికల సంఘం అధికారులు సర్వే చేపట్టారు. జూన్ 15 నుంచి ఇది మొదలై జూలై 14 వరకూ నెల రోజుల పాటు కొనసాగుతుంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తారు. ఆ తరువాత అభ్యంతరాలను ఫిర్యాదులను స్వీకరించి ఆ మేరకు సరిదిద్ది సెప్టెంబర్ 22న తుది జాబితాను రిలీజ్ చేస్తారు. దాంతో ఏపీలో మొత్తం ఓటర్ల జాబితా లెక్క తేలుతుంది. అందుకే వైసీపీ జాగ్రత్త పడుతోంది. తమ ఓట్లు గల్లంతు అయితే మాత్రం ఎన్నికల్లో భారీగా దెబ్బ తింటామని భావిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది దాంతో మరింత అలెర్ట్ అవుతోంది అంటున్నారు.
డూప్లికేట్ ఓట్ల ఏరివేత :
అయితే సర్ పేరుతో చేసేది పూర్తి ప్రక్షాళన అని అర్హుల ఓట్లు పోవని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. డూప్లికేట్ ఓట్లు ఉంటే కనుక పోతాయి, అలాగే చనిపోయిన వారి ఓట్లు దొంగ ఓట్లు తీసేస్తారు. ఇలా మొత్తం సవరించి అసలు ఓటర్ల జాబితాను లెక్క తీస్తారు. పైగా ప్రతీ ఇంటికీ వెళ్ళి సర్వే చేసి వారి వద్ద అన్ని ఆధారాలు ఉంటే ఓట్లు తీయరని అంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాలలో విపక్షాల విమర్శలు వివాదాలు గొడవలు చూసిన వైసీపీ ఏపీలో తమకు అలా జరుగుతుందా అన్న ఆందోళనతో జాగ్రత్త పడుతోంది అంటున్నారు. ఈ జాగ్రత్త మంచిదే అని వైసీపీ ఓటర్లను జాగ్రత్తగా నమోదు చేయించుకోవడానికి ఉపయోగపడుతుందని పార్టీ వాదులు అంటున్నారు.