తెలంగాణా బీజేపీకి మరో సువేందు అధికారి కావాలి ?
రాజకీయాల్లో షార్ట్ కట్ లో బలం పెంచుకోవడం అంటే ప్రత్యర్థుల నుంచి గుంజుకోవడమే .బలమైన నాయకులను తమ వైపునకు తిప్పుకుంటే సగం విజయం దక్కుతుంది.
రాజకీయాల్లో షార్ట్ కట్ లో బలం పెంచుకోవడం అంటే ప్రత్యర్థుల నుంచి గుంజుకోవడమే .బలమైన నాయకులను తమ వైపునకు తిప్పుకుంటే సగం విజయం దక్కుతుంది. ఆనక వారిని తమదైన వ్యూహంతో ముందు పెట్టి సామ దాన భేద దండోపాయాలు మొత్తం వాడేసి అధికారం అందుకోవడం అసలైన చాణక్యం. బీజేపీ ఈ విద్యలో బాగానే రాటు తేలుతోంది. దాంతో ఎన్నడూ చూడని చోట్ల బీజేపీకి అధికారం దఖలు పడుతోంది. ఈశాన్య రాష్ట్రాలు అస్సాం వంటి చోట్ల బీజేపీ వరసగా గెలవడానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత బిశ్వ శర్మ వంటి బిగ్ షాట్స్ కారణం. ఇక పశ్చిమ బెంగాల్ లో బెబ్బులి లాంటి మమతా బెనర్జీని ఓడించాలి అంటే ఆమె నమ్మిన బంటు నంబర్ టూ గా ఉన్న సువేందు అధికారిని తమ వైపునకు తిప్పుకున్నారు. దాంతో అధికారం గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి బీజేపీ ఒడిలో వచ్చి వాలింది.
తెలంగాణాలో ప్రయోగం :
బీజేపీకి తెలంగాణా విషయంలో ఒకటి బాగా అర్థం అయింది అని అంటున్నారు. సొంత పార్టీని నమ్ముకుంటే అయ్యే పని కాదని తేలిపోయింది అని అంటున్నారు. ఇపుడిపుడే బీజేపీ తెలంగాణాలో వికసిస్తోంది ఎనిమిది ఎంపీలు దక్కాయి అనుకుంటే వర్గ పోరుతో స్థానిక ఎన్నికల్లో వెనకబడిపోయింది. అంతే కాదు ఉప ఎన్నికల్లోనూ మూడో స్థానానికి దిగజారింది. దాంతో బీజేపీ ఈ వర్గ పోరుని చల్లార్చ లేకపోతోంది. అందరినీ ఏక త్రాటికి తేలేకపోతోంది. దాంతో తెలంగాణాలో కూడా షార్ట్ కట్ మెదడ్ తోనే అధికారం అందుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
బీజేపీ ఎంపీ సంచలనం :
ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ సొంత పార్టీ మీదనే సెటైర్లు పేల్చారు. అఫ్ కోర్స్ ఆయన తెలంగాణా పార్టీ నేతల తీరు మీదనే ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు అనుకోవాల్సి ఉంది. తెలంగాణాలో సువేందు అధికారి పాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఆయన అలా అనడానికి కూడా రీజన్ ఉంది. గత వారం తెలంగాణా పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ ఒక అధికారిక కార్యక్రమంలో ఓపెన్ గానే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. మాతో కలిస్తే అనుకున్నది సాకారం అవుతుందని. అంటే దాని మీద చిలవలు పలవలు చేస్తూ మాట్లాడిన వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంతకు ముందు అదే సభలో అభివృద్ధి గురించే ప్రధానిని కోరారు. దానికి బదులుగా ప్రధాని ఈ విధంగా జవాబు ఇచ్చారు అని కాంగ్రెస్ నేతలు అంటూంటే రాజకీయ విశ్లేషణలు చూస్తే వేరేలా ఉన్నాయి. ఇక బీజేపీ ఎంపీ అయితే రేవంత్ రెడ్డి విషయంలో అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఒక బహిరంగ సభలో ఇలా కామెంట్స్ వచ్చాయి అంటే కొంత అవగాహన ఉందేమో అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో వర్గ పోరు వల్లనే కేంద్ర బీజేపీ పెద్దలు ఇలా బయట చూపులు చూస్తున్నారు అన్న విమర్శలు కూడా బీజేపీ ఎంపీ మాటలలో వ్యక్తం అయ్యాయని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈయన మీద కూడా :
సరే ఈ విషయం మీద కాంగ్రెస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. దాంతో ఇవి కేవలం ఊహాగానాలుగానే ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సువేందు అధికారి అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ ని ఇబ్బందిపెడతారు అని అంటున్నారు. ఆయన బీఆర్ఎస్ ని చీల్చుతారని కూడా అంటున్నారు. మరి సువేందు అధికారి మీరు అంటే మీరు అని పార్టీల మధ్య చర్చ ఇపుడు సాగుతోంది. ఇంతకీ బీజేపీకి మాత్రం ఒక బలమైన నేత సువేందు అధికారి లాంటి వారు కావాలి అన్నది అర్థం అయిపోయింది. మరి బీజేపీకి తెలంగాణాలో అలా ఎవరైనా చిక్కుతారా లేదా అన్నదే చర్చగా ఉంది చూడాలి మరి ఏమి జరుగుతుందో.