గంటా ఎంపీ ఫోకస్...నిజమేనా ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ విరమణ చేస్తారని ఒక వైపు అంటున్నా ఆయన తగ్గేది ఉండదని మరో వైపు ప్రచారం సాగుతోంది.

Update: 2026-07-22 04:06 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ విరమణ చేస్తారని ఒక వైపు అంటున్నా ఆయన తగ్గేది ఉండదని మరో వైపు ప్రచారం సాగుతోంది. ఆయన ప్రస్తుతం భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఉన్నారు. 2014లో భీమిలీ నుంచి తొలిసారి గెలిచి అయిదేళ్ళ పాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించిన గంటా 2019లోనూ అదే సీటు కోరుకున్నారు. కానీ అధినాయకత్వం సూచనలతో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2024లో పట్టుబట్టి మరీ తిరిగి భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఊహిస్తే అది జరగలేదు. విస్తరణ మీద ఆశలు అయితే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన 2029 ఎన్నికల మీద కూడా ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

వారసుడిని బరిలోకి :

ఇక తన కుమారుడిని వారసుడిగా రంగంలోకి ఇప్పటికే గంటా దించేశారు. గంటా రవితేజా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని గంటా వర్గం అయితే గట్టి ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సీటు మీద జనసేన కన్ను కూడా ఉంది. అలాగే ఆ పార్టీలో చేరి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్ళీ భీమిలీ నుంచి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మరో వైపు టీడీపీలోనే కీలక నేతలు కూడా భీమిలీ నుంచి బరిలో ఉండవచ్చు అన్న ప్రచారమూ సాగుతోంది. అయితే గంటా వర్గం మాత్రం ఈ సీటు తమదే అంటోంది.

ఎంపీగా రంగంలోకి :

ఇక ఆ మధ్యన గంటా తన మనసులో మాటను మీడియా ముందు బయటపెట్టారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని అన్నారు. అయితే తాను విశాఖ నుంచి ఎంపీగానే 2029లో కూడా ఉంటాను అని అదే మీడియా మీటింగులో భరత్ క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికలకు విశాఖ పార్లమెంట్ సీటు మూడుగా మారుతుంది అన్నది ఉంది. లేదా రెండుగా కూడా మారవచ్చు అని అంటున్నారు. విశాఖ సెంట్రల్ పేరుతో కొత్త లఒక్ సభ సీటు వస్తే అందులో భీమిలీ అసెంబ్లీతో పాటు ఇతర నియోజకవర్గాలు ఉంటాయని అంటున్నారు. దాంతో గంటా ఆశలు ఆ విధంగా నెరవేరవచ్చు అని అంటున్నారు.

తొలిసారి ఎంట్రీతోనే :

ఇక గంటా రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన 1999లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన అపుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఆయన మంత్రి కోరిక కూడా తీర్చుకున్నారు. ఇపుడు ఆయన తన సీనియారిటీకి తగినది పార్లమెంట్ లోకి తిరిగి ప్రవేశం అని భావిస్తున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో పాటుగా తన కుమారుడికి భీమిలీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే గంటా కుటుంబంలో కూడా రెండు టికెట్లను పార్టీ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అంగబలం అర్ధబలంతో పాటు రాజకీయ చతురత బాగా ఉన్న గంటా గతంలో తన అనుచరులకు కూడా టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇపుడు తన కుటుంబంలో రెండు టికెట్లు ఇప్పించుకోవడం కష్టసాధ్యం కాదని అన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమవుతుందో అన్నది.

Tags:    

Similar News