సోషల్ మీడియా బ్యాన్...అమలు పెద్ద సవాల్

ఇదిలా ఉంటే ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు;

Update: 2026-03-06 23:30 GMT

ఈ రోజున పల్లె పట్నం మహా నగరం అన్న తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నది స్మార్ట్ ఫోన్. దానితో పాటే సోషల్ మీడియా కూడా. సోషల్ మీడియా అన్నది అంతా ఉపయోగిస్తున్నారు. భారత దేశంలో సోషల్ మీడియా మీద ఇప్పటిదాకా ఎలాంటి నిషేధం అయితే లేదు. దాంతో పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకూ అంతా సోషల్ మీడియాను తెగ వాడుతున్నారు. దాని వల్ల బాగు పడుతున్న వారు ఉన్నారు, చెడిపోతున్న వారూ ఉన్నారు. అయితే విచక్షణ తక్కువగా ఉండే యువత మాత్రం బలి అవుతోంది అన్న చర్చ ఉంది.

టీనేజ్ యువత బలి :

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా టీనేజ్ మీద ఉంది అన్నది అనేక అధ్యయనాలలో తెలుస్తోంది. ఆ వయసు అన్నది పెద్ద కాదు, అలాగని చిన్న కాదు, కౌమార దశ ఒక మాయ లాంటిది. దాంతో ఈ ఆకర్షణలో పడి చదువు పాడు చేసుకుంటున్నారు తమ సొంత ప్రతిభను కాదనుకుంటున్నారు కెరీర్ ని సైతం ఫణంగా పెడుతున్నారు. మెదడుని పూర్తిగా సోషల్ మీడియాకు అప్పగిస్తున్నారు. ఆ ఏజ్ లో సోషల్ మీద పడడంతో వారిలో ఎక్కువ మంది సైకోలుగా మారిపోతున్నారు. అంతే కాదు సమాజానికి కుటుంబానికి ఇబ్బందిగా మారుతున్నారు. దాంతో సోషల్ మీడియాను కనీసం టీనేజ్ వయసు వారికి దూరంగా ఉంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.

ఆస్ట్రేలియాలో నిషేధం :

ఇక ప్రపంచంలో చూసే ఆస్ట్రేలియా దేశంలో సోషల్ మీడియాను నిషేధించారు. అక్కడ చిన్న వయసు వారికి దీనిని అందుబాటులో లేకుండా చేశారు. ఈ నిషేధాన్ని ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎవరైనా వాడితే అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే ఆ శిక్షలు సోషల్ మీడియాను ఉపయోగించిన చిన్నారుల మీద వారి తల్లిదండ్రుల మీద ఉండవు. నేరుగా సదరు కంపెనీల మీదనే ఉంటాయి. సోషల్ మీ\డియా ఫ్లాట్ ఫారం లను చిన్న పిల్లలకు దూరంగా ఉంచేందుకు ఆస్ట్రేలియా ఈ విధంగా కఠినంగా వ్యవహరిస్తోంది.

ఏపీలో సైతం :

ఇదిలా ఉంటే ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు సామాజిక మాధ్యమాల కారణంగా 13 ఏళ్ల లోపు పిల్లలు నష్టపోకుండా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. దీని మీద సాధ్యమైనంత త్వరలోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం పై ఐటీ మంత్రి నారా లోకేష్ అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేశారని చంద్రబాబు చెప్పారు

కర్ణాటకలో కూడా :

ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం కూడా టీనేజర్లకు సోషల్ మీడియా అందుబాటులోకి రాకుండా నిషేధం విధించింది. అక్కడ బడ్జెట్ సెషన్ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో యువత ఉందని ఆయన అన్నారు. తమ పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తే సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుతున్నారని ఆయన అన్నారు మరీ ముఖ్యంగా సొంతంగా లాగిన్ ఐడీలు క్రియేట్ చేసుకుని మరీ సోషల్ మీడియా ప్రభావంతో పడుతున్నారని అన్నారు. అందువల్ల ఇక మీదట 16 ఏళ్ళ లోపు పిల్లలు లాగిన్ అయ్యే ముందు తమ వయసును తప్పనిసరిగా ధృవీకరినాలని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సాంకేతికంగా సమస్యలు :

అయితే సామాజిక మాధ్యమాన్ని నిషేధించడం సులువు. కానీ దానిని అమలు చేయడం మాత్రం టెక్నికల్ గా బిగ్ ఇష్యూ అని అంటున్నారు. వయసు దృవీకరణను తప్పనిసరి చేయాలని సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తేనే ఇది సాధ్యపడుతుంది అని అంటున్నారు. ఆ మీదట ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం భారీ జరీమానాలు ఆ కంపెనీల మీదనే విధించడం వల్ల మాత్రమే ఈ నిషేధం గట్టిగా అమలు అవుతుంది అని అంటున్నారు. ఆస్ట్రేలియాలో ఇదే విధానం అమలులో ఉందని అంటున్నారు. అన్నీ స్టడీ చేసిన మీదటనే ఈ నిషేధం అమలు చేస్తే సక్సెస్ అవుతుందని అంటున్నారు. అయితే భారత్ లో ఇప్పటిదాకా ఈ నిషేధం లేదు, ఇపుడు కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు నిషేధం అంటున్నాయి. మరి సోషల్ మీడియా సంస్థల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అవి ఏ విధంగా స్పందిస్తాయి అన్నది కూడా చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News