‘జగన్ కృషితో తిరుగులేని స్థితికి పోలవరం!’’ - వైసీపీ ట్వీట్ పై హాట్ డిబేట్

పోలవరం ప్రాజెక్టు మీదుగా గోదావరి వరద ప్రవాహిస్తున్న వీడియోను దీనికి జత చేశారు. దీంతో సోషల్ మీడియాలో అధికార, విపక్షాల మధ్య ఈ ట్వీట్ హాట్ డిబేట్ గా మారింది.

Update: 2026-08-06 14:16 GMT

పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కృషి కారణంగా పోలవరం ప్రాజెక్టు తిరుగులేని స్థితికి చేరుకుందని, ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగినా, గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైయస్ జగన్ తీసుకున్న చర్యలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు మీదుగా గోదావరి వరద ప్రవాహిస్తున్న వీడియోను దీనికి జత చేశారు. దీంతో సోషల్ మీడియాలో అధికార, విపక్షాల మధ్య ఈ ట్వీట్ హాట్ డిబేట్ గా మారింది.

రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా అధికార కూటమి, విపక్షం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తామే పునాదులు వేశామని, తమ విధానాలు కారణంగానే అభివృద్ధి జరుగుతోందని వైసీపీ చెప్పుకుంటుండగా, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని వైసీపీ ధ్వంసం చేస్తే, తాము వచ్చిన రెండేళ్లలోనే అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని అధికార పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ చేసిన ట్వీట్ సెగలు పుట్టిస్తోంది. వైసీపీ ఏ పనీ చేయకపోయినా ట్వీట్ చేసుకోవడంపై కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులు కామెంట్లు రూపంలో విమర్శల దాడి చేస్తున్నారు.

ఈ నెల 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇరువైపులా మాటల యుద్దం జరిగింది. ఎయిర్ పోర్టు నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కారణమని, ఆయన హయాంలోనే భూ కేటాయింపులు, అనుమతులు తీసుకువచ్చామని వైసీపీ ప్రచారం చేసుకుంది. అయితే కూటమి నేతలు మాత్రం భోగాపురం ఎయిర్ పోర్టు తమ హయాంలోనే పూర్తయిందని, రెండేళ్లలో పనులను పరుగులు పెట్టించి, రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే, ఈ నెల 3న వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోలవరంపై ట్వీట్ చేయడంతో మరోసారి డైలాగ్ వార్ తీవ్రరూపం దాల్చింది.

పోలవరం ప్రాజెక్టు జగన్మోహనరెడ్డి ఘనతే అంటూ వైసీపీ ట్వీట్ చేసి మూడు రోజులు అవుతోంది. అయినప్పటికీ ఆ ట్వీట్ పై చర్చ ఆగలేదు. వందల సంఖ్యలో కూటమి కార్యకర్తలు కామెంట్లతో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మూడు రోజుల్లో 4 లక్షల మందికి ఆ వీడియో రీచ్ కాగా, సుమారుగా 450 మంది కామెంట్లు చేశారు. ఇక వైసీపీ ట్వీట్ కు కౌంటరుగా ఆ పార్టీ అధికారంలో ఉండగా ఐదేళ్లు ఏం చెప్పిందో వివరిస్తూ జనసేన పార్టీ ఒక వీడియో రూపొందించింది. ఇందులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వివిధ సందర్భాల్లో పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడిన వీడియోను జత చేసింది.

ఇలా పోలవరం ప్రాజెక్టుపై క్రెడిట్ కోసం వైసీపీ ప్రయత్నించగా, ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో చెప్పాలంటూ కూటమి కార్యకర్తలు నిలదీస్తున్నారు. మొత్తానికి వైసీపీ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆ ఏడాది గోదావరి పుష్కరాలు జరగనుండగా, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఈ నెల 1న ప్రధాని మోదీ సమక్షంలోనే సీఎం ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం పూర్తి చేయడంలో తమకు వాటా ఉందని చెప్పుకునేందుకు వైసీపీ ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News