బొండా ఎందుకలా..? చంద్రబాబు భేటీ, వెంటనే వైసీపీతో ఫైటింగ్!

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తీరు పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల తన చుట్టూ చెలరేగిన వివాదంతో కొంతవరకు ఆత్మరక్షణకు లోనైన ఎమ్మెల్యే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

Update: 2026-08-06 13:29 GMT

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తీరు పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల తన చుట్టూ చెలరేగిన వివాదంతో కొంతవరకు ఆత్మరక్షణకు లోనైన ఎమ్మెల్యే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇందులో ఇటీవల కాపు నేత ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లిన సందర్భంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలవడంతోపాటు ఆ తర్వాత చోటుచేసుకున్న వివాదంపై వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే వివరణతో సీఎం సంతృప్తి చెందినట్లు వార్తలు వెలువడగా, ఆ వెంటనే ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబుతో ఎమ్మెల్యే బొండా భేటీ అయ్యారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ముందుగా వన్ టు వన్ మాట్లాడారని, అనంతరం తన ఇద్దరు కుమారులను సీఎంకు పరిచయం చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తలెత్తిన వివాదాలపై వివరణ ఇచ్చారని అంటున్నారు. ఇక బొండాతో సరదాగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇంతకు ముందులా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారని చెబుతున్నారు. దీంతో తన విషయంలో అధినేత సానుకూలంగా ఉన్నట్లు భావించిన ఎమ్మెల్యే రెట్టించిన ఉత్సాహంతో బయటకు వచ్చారని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో గురువారం ఎమ్మెల్యే బొండా మరో వివాదంలో చిక్కుకోవడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. పార్టీ అంతర్గత సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకున్న ఎమ్మెల్యే.. విపక్షం వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తుండగా, సెంట్రల్ నియోజకవర్గంలోనూ యథాతథంగా రిలే దీక్ష శిబిరం నిర్వహించింది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రంగా స్పందించడమే వివాదానికి దారితీసిందని అంటున్నారు.

వందల మంది అనుచరులను వెంట బెట్టుకుని వైసీపీ నిరసన దీక్ష శిబిరం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమా మంత్రి లోకేశ్ ను తిడుతున్నారంటూ వాదులాటకు దిగడమే హాట్ టాపిక్ అవుతోంది. విపక్షంపై ఆయన దూకుడుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం తర్వాత వచ్చిన ఉత్సాహమే అంటున్నారు. తమపై ఉమా అనుచరులు దాడి చేయడంపై మీడియాతో మాట్లాడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. సహజంగా ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెబుతుంటారని, కానీ ఇప్పుడు తమ ఎమ్మెల్యే చేసిన పనికి ఏం చెబుతారంటూ విపక్ష నేతలు ప్రశ్నించడాన్ని ఎత్తిచూపుతున్నారు.

Tags:    

Similar News