అమరావతి ఫస్ట్ స్టాట్యూ.. ఆవిష్కరణ.. ఎవరిదంటే!
ఏపీ రాజధాని అమరావతిలో పలువురు దేశ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే.;
ఏపీ రాజధాని అమరావతిలో పలువురు దేశ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, తెలుగువారి అన్నగారు, మాజీ సీఎం ఎన్టీఆర్, జాతిపిత మహాత్మాగాంధీల విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావించారు. వీటిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి కూడా కేటాయించారు. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇక, ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం విగ్రహ నిర్మాణానికి సంబం ధించి ఇంజనీరింగ్ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పా టు విషయం ప్రస్తుతం వాయిదా పడింది. అయితే.. అసలు ఈ జాబితాలో లేని మరో దేశ నేత పేరు తెరమీదికి రావడం.. ఆయనకు సంబంధించి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడం గమనార్హం. ఆయనే మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి.
గురువారం(డిసెంబరు 25) వాజ్ పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ఏకంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. అమరావతిలోని వెంకటపాలెంలో 3 ఎకరాల స్థలంలో నిర్మించిన వాజ్ పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, మంత్రులు హాజరయ్యారు.
అయితే.. వాజపేయి విగ్రహానికి భూమి కేటాయింపు.. నిర్మాణం వంటి అంశాలు శరవేగంగా జరిగిపోవడం.. కూటమి సఖ్యతకు నిదర్శనమని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. కాగా.. అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహం 13 అడుగుల ఎత్తుతో ఉంది. మొత్తం పీఠంతో కలుపుకొని 17 అడుగుల ఎత్తులో నిర్మించారు.