'అదుర్స్' లో ఎన్టీఆర్ డైలాగు చెబుతున్న అమెరికా మంత్రి.. మేటర్ సీరియస్!
ఈ సందర్భంగా... 'ఓ పడవలో ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్తున్న సమయంలో అతడికి కలిసి అతడి ప్రైవేటు ద్వీపంలో లంచ్ చేశాను.. అనంతరం అక్కడే ఓ గంటపాటు ఉన్నాను..;
మొన్నటి వరకూ అగ్రరాజ్యం అమెరికాలోనే ప్రకంపనలు సృష్టించినట్లు కనిపించిన ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం వ్యవహారం... కొత్త కొత్త ఫైల్స్ విడుదలయ్యే కొద్దీ మరిన్ని సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సమయంలో ఎప్ స్టీన్ కరేబియన్ ద్వీపాన్ని సందర్శించినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హువార్డ్ లుట్నిక్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అవును.. గతంలో తాను ఎప్పుడో ఎప్ స్టీన్ తో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించిన దానికి పూర్తి భిన్నమైన వాంగ్మూలం తాజాగా ఇచ్చారు అమెరికా వాణిజ్య మంత్రి హువార్డ్ లుట్నిక్. ఇందులో భాగంగా... 2012లో తాను ఎప్ స్టీన్ ద్వీపాన్ని సందర్శించానని.. అక్కడ అతడితో కలిసి లంచ్ చేశానని.. అమెరికా కాంగ్రెస్ ఎదుట లుట్నిక్ వెల్లడించారు. అయితే... తాను అక్కడికి ఎందుకు వెళ్లిందీ మాత్రం గుర్తులేదని ఆయన చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నారు.
ఈ సందర్భంగా... 'ఓ పడవలో ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్తున్న సమయంలో అతడికి కలిసి అతడి ప్రైవేటు ద్వీపంలో లంచ్ చేశాను.. అనంతరం అక్కడే ఓ గంటపాటు ఉన్నాను.. ఆ సమయంలో నాతో నా భార్య, పిల్లలు, వారిని చూసుకునే ఆయాలు కూడా ఉన్నారు.. ఇది నిజం.. కాకపోతే అక్కడికి ఎందుకు వెళ్లామో మాత్రం గుర్తులేదు' అని లుట్నిక్ పేర్కొన్నారు! ఇదే సమయంలో.. 14 ఏళ్లలో 3 సార్లు మాత్రమే అతన్ని కలిశానని.. 10 ఈమెయిల్ సంభాషణలు జరిగాయని అంగీకరించారు!
అయితే... ఇటీవల అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం... లుట్నిక్ 2012 డిసెంబర్ 23న ఎప్ స్టీన్ ప్రైవేటు ద్వీపమైన సెయింట్ జేమ్స్ కు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఉదయం లుట్నిక్ భార్య.. ఎప్ స్టీన్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి, తమ బోటును ద్వీప సమీపంలో లంగరు వేయడానికి ఏర్పాట్లు చేసిందని ఈమెయిల్స్ సూచిస్తున్నాయని అంటున్నారు! ఏది ఏమైనా తాజా అంగీకారం హాట్ టాపిక్ గా మారింది.
లుట్నిక్ రాజీనామాకు డిమాండ్!:
తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించిన డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్... జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించి లుట్నిక్ ఏదైనా తప్పు చేశారా లేదా అనేది సమస్య కాదని.. కానీ, అతని నీచమైన నేరపూరిత దోపిడీ చర్యల నుంచి బయటపడటం కోసం.. కాంగ్రెస్ కు, అమెరికా ప్రజలకు.. అతనితో ఉన్న సంబంధ పరిధిని పూర్తిగా తప్పుగా చూపించారని అన్నారు. ఈ సందర్భంగా... లుట్నిక్ ని రాజీనామా చేయాలని డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సీ పిలుపునిచ్చారు.
లిట్నిక్ కి మద్దతుగా వైట్ హౌస్!:
ఈ సందర్భంగా లుట్నిక్ రాజీనామా డిమాండ్లు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. ఇందులో భాగంగా.. తాజాగా స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్... అధ్యక్షుడు ట్రంప్ బృందంలో లుట్నిక్ చాలా ముఖ్యమైన సభ్యుడిగా కొనసాగుతున్నారని.. తాను ఏ తప్పూ చేయలేదని లుట్నిక్ స్వయంగా నొక్కి చెప్పారని.. ఆ విషయం తన భార్యకు కూడా తెలుసని అన్నారని పేర్కొన్నారు. లుట్నిక్ పై ట్రంప్ కు నమ్మకం ఉందని వెల్లడించారు!