జెన్ జెడ్ : ‘యాంటీ అంబిషన్’ కాదు.. కొత్త జీవన తత్వం
ఒకప్పుడు విజయం అంటే ఆకాశమే హద్దుగా ఎదగడం.. కార్పొరేట్ నిచ్చెనను వేగంగా ఎక్కడం.. భారీ ప్యాకేజీలు, మేనేజర్ హోదాల కోసం అహర్నిశలు శ్రమించడం.;
ఒకప్పుడు విజయం అంటే ఆకాశమే హద్దుగా ఎదగడం.. కార్పొరేట్ నిచ్చెనను వేగంగా ఎక్కడం.. భారీ ప్యాకేజీలు, మేనేజర్ హోదాల కోసం అహర్నిశలు శ్రమించడం. కానీ, నేటి తరం జెన్ జెడ్ ఈ నిర్వచనాలను తిరగరాస్తోంది. వీరికి కెరీర్ కంటే 'లైఫ్' ముఖ్యం. దీనినే పాత తరం వారు "యాంటీ అంబిషన్" (ఆశయాలు లేని తరం) అని విమర్శిస్తుంటే యువత మాత్రం దీన్ని ఒక కొత్త జీవన తత్వంగా అభివర్ణిస్తోంది.
మారిన విజయపు కొలమానాలు
గతంలో ర్యాంకులు, హోదాలు, ఆస్తులే విజయానికి గుర్తులుగా ఉండేవి. కానీ నేటి యువత దృష్టిలో విజయం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఒత్తిడితో కూడిన లక్షల జీతం కంటే ప్రశాంతంగా ఉండే తక్కువ జీతం మేలని వీరు భావిస్తున్నారు. వీకెండ్స్‌లో కూడా ఆఫీస్ కాల్స్ ఎత్తడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. పని వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే స్పష్టమైన విభజన వీరికి ప్రాధాన్యత.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 47% మంది యువ ఉద్యోగులు ప్రమోషన్ల కంటే ప్రశాంతతకే ఓటేస్తున్నారు. 52% మంది కెరీర్ ఎదుగుదల కంటే మానసిక స్థిరత్వం ముఖ్యమని నమ్ముతున్నారు. దాదాపు 41% మంది ఒత్తిడి లేని ఉద్యోగాల కోసం తక్కువ జీతానికైనా సిద్ధపడుతున్నారు.
ఒత్తిడి నుండి విముక్తి కోసమేనా?
బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో పనిచేసే యువత అభిప్రాయం ప్రకారం.. తమ సీనియర్లు 30-35 ఏళ్లకే తీవ్రమైన ఒత్తిడికి, అనారోగ్య సమస్యలకు గురికావడం వారు గమనిస్తున్నారు. "మా నాన్న తరం ఆఫీసు కోసమే బతికారు.. కానీ మేము బతకడం కోసం మాత్రమే పని చేస్తాం" అన్నది ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాట. ఇది అలసత్వం కాదు.. భవిష్యత్తుపై ఉన్న స్పష్టత. పని కోసం జీవించడం కంటే.. జీవించడానికి పని చేయడం మిన్న.. ఇదే నేటి జెన్ జెడ్ నినాదం.
కార్పొరేట్ ప్రపంచానికి కొత్త సవాళ్లు
జెన్ జెడ్ ఆలోచనలు కంపెనీలకు పెద్ద సవాలుగా మారాయి. టాలెంట్ ఉన్న యువతను ఆకట్టుకోవాలంటే కేవలం జీతం పెంచితే సరిపోదని సంస్థలు గుర్తిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ మోడల్స్ కోరుకుంటున్నారు. గంటల తరబడి ఆఫీసులో ఉంచే సంస్కృతికి వీరు స్వస్తి పలుకుతున్నారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే కంపెనీల వైపే యువత మొగ్గు చూపుతోంది.
కోవిడ్ నేర్పిన పాఠం
కరోనా మహమ్మారి తర్వాత జీవితం ఎంత అనిశ్చితమో అందరికీ అర్థమైంది. రేపు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఇప్పుడే జీవితాన్ని ఆస్వాదించాలనే ధోరణి పెరిగింది. అందుకే ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, క్విట్ క్విటింగ్ వంటి ట్రెండ్స్ ఊపందుకున్నాయి.
ఇది అంతం కాదు.. ఆరంభం!
జెన్ జెడ్‌ను "యాంటీ అంబిషన్" అని పిలవడం వారిని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వారు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అది వారి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పణంగా పెట్టి కాదు. ఇది ఒక 'ప్రో-లైఫ్' తరం. పనిని కేవలం జీవితంలో ఒక భాగంగా మాత్రమే చూస్తూ పూర్తి జీవితాన్ని ఆస్వాదించాలనుకునే ఈ కొత్త తత్వం భవిష్యత్తులో మరింత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తుందని ఆశించవచ్చు.