బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !
| రాజకీయాలు అన్నింట్లోనూ పై చేయి సాధిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతోంది.
రాజకీయాలు అన్నింట్లోనూ పై చేయి సాధిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతోంది. అలాంటి చోట రాజకీయాన్ని పక్కన పెట్టి విపత్తు వేళ అంతా ఒక్కటిగా నిలవడం మాత్రం ఆసక్తిని పెంచుతోంది. ఏపీ రెండు భారీ తుఫాన్లతో చిక్కుకుని విలవిలలాడుతున్న నేపథ్యంలో ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలు అండంగా నిలవడం గొప్ప విషయంగానే చూడాలని అంటున్నారు. ఇక్కడ ఎన్డీయేలో టీడీపీ ఉంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల ప్రభుత్వాలు ఏపీకి స్నేహ హస్తం అందిస్తున్నాయి. దాంతో ఇది కదా కావాల్సింది అని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది.
ఆ మద్దతు కీలకం :
ఒక వైపు ఆర్నాబ్ తుఫాన్ మరో వైపు మురసు తుఫాను ఏపీని చిన్నాభిన్నం చేసిన పరిస్థితి ఉంది. మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బ తిని పోయాయి. అలాగే ఎక్కడికక్కడ విద్యుత్ స్థంభాలు కుప్ప కూలి చీకటితో గ్రామాలు గడుపుతున్న నేపథ్యంలో పునరుద్ధరణ పనులకు తమదైన సాయం చేసేందుకు తెలంగాణా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం అభినందించాల్సిందే అంటున్నారు. తెలంగాణా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడులో విజయ్ నాయకత్వంలో టీవీకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా సరే రాజకీయ భేదభావాలు పక్కకు నెట్టి అందరూ ఏపీకి మద్దతు ఇవ్వడం అంటే దక్షిణాదిన నెలకొన్న ఈ ఐక్యత మీద అంతటా చర్చ సాగుతోంది.
బాబు సమర్థతతో :
ఇక్కడ చంద్రబాబు నాయకత్వం సమర్ధత గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన కో ఆర్డినేట్ చేసుకున్నారు. భేషజాలు పక్కన పెట్టి పొరుగు రాష్ట్రాలను సంప్రదించారు. ఆదుకోవాలని కోరారు. అలా తీవ్రమైన అర్నాబ్ తుఫాను సృష్టించిన భారీ విధ్వంసం తర్వాత బాబు చేసిన ఈ విన్నపాలకు అంతే స్థాయిలో సానుకూల స్పందన కనిపించింది. దాంతో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఏపీలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణను వేగవంతం చేయడానికి వేలాది మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రత్యేక యంత్రాలను పంపించడం ద్వారా అత్యవసర సహాయాన్ని అందించి శభాష్ అనిపించాయి.
భారీ ఎత్తున నష్టం :
ఇక ఆర్నాబ్ తుఫాను కోస్తాలోని పలు జిల్లాల్లో విద్యుత్ సదుపాయలతో సహా ఇతర మౌలిక సదుపాయాలకు భారీ ఎత్తున నష్టం కలిగించింది. ఏకంగా పదిహేను వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నిరవధికంగా అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ పునరుద్ధరణ పనులు సవాల్ గా మారాయి. శరవేగంగా వీటిని పరిపూర్తి చేయాలంటే ఏపీలోని సిబ్బంది యంత్రాంగం సరిపోరని అంచనా వేసిన చంద్రబాబు సహాయం కోరుతూ పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలను కీలక సమయంలో సంప్రదించారు. అలా బాబు చూపించిన చొరవకు స్పందిస్తూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తమ బృందాలను ఏపీకి పంపించాయి. దాంతో పునరుద్ధరణ పనులలో వేగం పుంజుకుంది.
రాష్ట్రాల సమన్వయంతో :
ఇది ఒక విధంగా రాష్ట్రాల మధ్య సమన్వయం గా చెప్పాలి. ఒక రాష్ట్రానికి కష్టం వచ్చినపుడు తోటి రాష్ట్రం ఎలా స్పందించాలి అన్న దానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ విషయంలో సీనియర్ ముఖ్యమంత్రి అనుభవం కలిగిన నేత అయిన చంద్రబాబు పొరుగు రాష్ట్రాలతో చేసుకున్న సమన్వయం ఒక స్ఫూర్తి వంతంగా ఉంది. రాజకీయాలను పక్కన పెట్టి ఇరుగు పొరుగుల మధ్య ఉండాల్సిన సహకారాన్ని ఆయన గుర్తెరిగి వేసిన ముందడుగుతోనే పెద్ద ఎత్తున ఏపీకి సహకారం లభిస్తోనిద్. ఇదంతా రాజకీయాలకూ అతీతంగా బాబు సంపాదించుకున్న సంబంధాలు అని కూడా అంటున్నారు.
వేగంగా పనులతో :
ఇక ఏపీలో విద్యుత్ పునరుద్ధరణకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సుమారు రెండు వేల మంది విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు అత్యవసర వాహనాలు, మరమ్మతు పరికరాలను తరలించింది. అలాగే డీకే శివకుమార్ నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 500 మంది నైపుణ్యం గల కార్మికులతో పాటు భారీ క్రేన్‌లు, ఎర్త్ ఆగర్‌లతో కూడిన 15 పాల్ఫింగర్ ట్రక్కులను, 25 ట్రాక్టర్ మౌంటెడ్ డ్రిల్లింగ్ యంత్రాలను ఏపీకి పంపింది. ముఖ్యమంత్రి విజయ్ కూడా తమిళనాడు నుంచి 500 మంది సభ్యులతో కూడిన విద్యుత్ శాఖ బృందాన్ని పంపి తన సహకారాన్ని చాటుకున్నారు. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ బృందాలు అంతా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను చక్కదిద్దడానికి, తెగిపోయిన హై-టెన్షన్ వైర్లను పునరుద్ధరించడానికి స్థానిక విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడానికి ఏపీ విద్యుత్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు.
ఒక రోల్ మోడల్ గా :
ఈ రోజున ఏపీకి వచ్చిన పెను విపత్తులో ఈ విధంగా తోటి రాష్ట్రాలు సాయం అందించి పంచుకున్నాయంటే భవిష్యత్తులో ఇది ఒక రోల్ మోడల్ గా ఉంటుందని అంటున్నారు. దానికి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. అలా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చూపిన సంఘీభావం ప్రాంతీయ సహకార బలాన్ని సైతం చాటి చెబుతోంది అని అంటున్నారు. ప్రాంతాలు రాజకీయాలు వేరు అయినా ఆపదలో ఆదుకునేందుకు ముందుకు రావాలన్నది ఇది తెలియచేస్తోంది అని అంతున్నారు. అదే సమయంలో ఎక్కడ రాజకీయం చేయాలో ఎక్కడ సమన్వయం చేసుకోవాలో తెలిసిన నేతగా చంద్రబాబును అంతా చూస్తున్నారు. గతంలో హుదూద్ తుఫాన్ సమయంలో కూడా బాబుకు తమిళనాడు, తెలంగాణా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి సహకారం అందింది అంటే అది ఆయన పలుకుబడి స్నేహ భావం అని అంతా గుర్తు చేస్తున్నారు.