వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!
| టీడీపీ తరఫున పోటీ చేసిన వారు విజయం దక్కించుకుంటున్నారు. అలానే.. అడపాదడపా వైసీపీ అభ్యర్థులు కూడా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏపీలో ముమ్మరంగా సాగుతోంది. చాలా వరకు మునిసిపల్ స్థానాల్లో తుది ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ నేప థ్యంలో వైసీపీ ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా చర్చ సాగుతుండడం గమనార్హం. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ప్రభావం ఎక్కువగానే ఉంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వారు విజయం దక్కించుకుంటున్నారు. అలానే.. అడపాదడపా వైసీపీ అభ్యర్థులు కూడా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు.
అయితే.. వైసీపీ అధినేత జగన్ చెబుతున్నట్టుగా తమకు 40 శాతం మేరకు ఓటు బ్యాంకు ఉందన్నట్టుగా.. తాజా ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందా? అనేది ఆసక్తిగా మారింది. గత రెండున్నరేళ్ల కిందట 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు వచ్చింది. పార్టీఘోరంగా ఓడిపోయినా.. కేవలం 11 స్థానాలకే పరిమితం అయినా.. ఓటు బ్యాంకును మాత్రం వైసీపీ దక్కించుకుంది. ఇదే ఇప్పుడు కూడా కాపాడుతుందని జగన్ పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలలో వైసీపీ ఓటు బ్యాంకుపైనే చర్చ జరగడం గమనార్హం.
ఎక్కడికక్కడ..
వైసీపీ ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. తాజా ఎన్నికల్లో బాగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఎక్కడ కూటమి అభ్యర్థి గెలిచినా.. కేవలం 100 నుంచి 200 ఓట్ల లోపే మెజారిటీ ఉండడం గమనార్హం. చాలా చోట్ల అయితే.. ఇది 50 లోపే ఉండడం మరింత విశేషం. అంటే.. ఆయా ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు బలమైన పోటీనే ఇచ్చారు. సీట్లు గెలుచుకోవడంలో వెనుకబడినా.. ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం వైసీపీ అభ్యర్థులు గట్టిగానే నిలబడ్డారని స్పష్టమవుతోంది.
కీలకమైన కృష్ణా, ఎన్టీఆర్, విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ.. పెద్ద ఎత్తున వైసీపీ అభ్యర్థులకు ఓట్లు కురిశాయి. అయితే..మెజారిటీ దక్కించుకోలేక పోవచ్చు. . గెలుపు గుర్రం ఎక్కలేక పోవచ్చు. కానీ, వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగానే ఉందన్న సంకేతాలు కాదు.. వాస్తవాన్నే తాజా ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. అయితే.. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటుందా? ఉండదా? అనేది పక్కన పెడితే.. వైసీపీ ప్రభావం మాత్రం ఉందన్నది ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.