సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ప్ర‌భుత్వం: ఏపీ గ‌వ‌ర్న‌ర్‌

రాష్ట్రంలో పారిశ్రామికంగా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.;

Update: 2026-02-11 10:28 GMT

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. ఆన‌వాయితీ ప్ర‌కారం.. తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేసింది? భ‌విష్య‌త్తులో ఏం చేయ‌నుంది? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. సుదీర్ఘంగా సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌స్తావించారు. త‌మ ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

టెక్నాల‌జీకి పెద్ద‌పీట

పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభరీతిలో సేవలు అందిస్తోం దని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విశాఖ గూగుల్ డేటా ద్వారా ల‌క్ష మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని.. చెప్పారు. ఇది ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌కానుంద‌న్నారు. టెక్నాల‌జీలో భాగంగా అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ కంప్యూట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని.. ఇక్క‌డ నుంచే వివిధ దేశాల‌కు కంప్యూట‌ర్లు ఎగుమ‌తి అవుతాయ‌న్నారు.

పారిశ్రామికంగా..

రాష్ట్రంలో పారిశ్రామికంగా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువపారిశ్రామిక వేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని అందిస్తున్నామ‌న్నారు. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 26 జిల్లాలను 28కి ప్రభుత్వం పెంచామ‌ని తెలిపారు.

భూములు ప‌దిలం!

భూమి రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరచటంతో పాటు సర్వే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నామ‌ని.. త‌ద్వారా భూములు ప‌దిలంగా ఉంటాయ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటంతో పాటు 22 ఏ కింద పెట్టిన భూములను ప్రభుత్వం సమీక్షిస్తోందన్నారు. స్వ చ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన‌ట్టు వివ‌రించారు. గత పాలకులు వదిలి వెళ్లిన చెత్తను తొలగించి సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తున్న‌ట్టు తెలిపారు.

మన మిత్ర వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేశామ‌న్నారు. 14 ఏళ్ల వయసు లోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఆర్ధిక ఒత్తిళ్లు, బాధ్యతలూ ఉన్నా క్రమశిక్షణతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నామ‌ని తెలిపారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింద‌న్న గ‌వ‌ర్న‌ర్‌... తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు చేరిందని.. ఇది ప్ర‌జ‌ల ఆర్థిక పురోగ‌తిని తేట‌తెల్లం చేస్తోంద‌ని వివ‌రించారు.

జ‌లాల‌పై రాజీలేదు.. న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌తో సీమ స‌స్య‌శ్యామ‌లం: ఏపీ

నీటి విష‌యంలో ఎలాంటి రీజీ ఉండ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ లింకు ప్రాజెక్టును ఎట్టి ప‌రిస్థితిలోనూ పూర్తి చేస్తామ‌ని, త‌ద్వారా రాయల సీమ జిల్లాల‌ను స‌స్య‌శ్యామలం చేస్తామ‌ని ఉద్ఘాటించారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌.. జ‌లాల‌పై కీల‌క ప్ర‌సంగం చేశారు.

రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థకు పోలవరం ప్రాజెక్టు వెన్నెముకగా గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. 2027, జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉందన్నారు. కరవు ప్రభావిత ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రభుత్వం నీరు అందిస్తోంద‌న్నారు. నల్లమల సాగర్ – నదుల అనుసంధానం ద్వారా పోలవరం నుంచి గోదావరి వరద జలాలను తరలించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. ఈ విష‌యంలో రాజీ ప‌డ‌బోద‌న్నారు.

అలాగే.. వంశధార నుంచి దక్షిణ భారత్‌లోని నదీ వ్యవస్థలను అనుసంధానించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల ఏర్పాటు, యాత్రీకులకు వసతి, రవాణా వంటి ఏర్పాట్ల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు.

పోర్టు ఆధారిత సేవ‌లు విస్తృతం!

విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా రీజియన్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. కేం ద్ర బడ్జెట్‌లో ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్లు రాష్ట్రానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌నున్నాయ‌న్నారు. విజయవాడ, గుంటూరు, అమరావతిల మధ్య రాజధాని నిర్మాణంతో లాజిస్టిక్స్, ప్రముఖ సంస్థల ఏర్పాటు, ఇతర ఆర్ధిక లావాదేవీలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు టైర్ 2 నగర సమూహంగా ఎదుగుతున్నాయ‌ని వివ‌రించారు.

పోర్టు ఆధారిత అభివృద్ధి, ఆక్వా కల్చర్ , తీరప్రాంత సుస్థిరాభివృద్ధి, రాయలసీమలో ఉద్యాన పంటలు, గిరిజన ప్రాంతాల్లో విలువ ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేలా చట్టబద్దత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంద‌న్నారు.

ప్రాంతీయఅస‌మాత‌న‌లు త‌గ్గిస్తాం

ప్రాంతీయ సమానత‌లు త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ వివ‌రించా రు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపా యాలు, పరిశ్రమల పెట్టుబడులతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ, పెట్టుబడుల్లో వేగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి ఆర్ధిక కార్యలాపాలకు దోహద పడుతున్నాయని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ , ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ , క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటి, సెమీ కండక్టర్ ఎకో సిస్టం లాంటివి ఏపీ అభివృద్ధికి కీలకం అవుతాయన్నారు.

Tags:    

Similar News