రూ.2 లక్షలు - రూ.60 వేలు.. లాండ్రీ షాపు ఆదాయంపై నెట్టింట వైరల్ ఫైట్!

అవును... ఓ మహిళా ‘ఎక్స్’ యూజర్ తన పోస్టులో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.;

Update: 2026-02-11 10:27 GMT

సాధారణంగా ఒక లాండ్రీ షాపు (ఇస్త్రీ + డ్రై క్లీనింగ్) యజమాని ఆదాయం నెలకు ఎంత ఉంటుంది..? సరాసరిన నెలకు సుమారు రూ.2 లక్షలు అని ఒకరంటే.. ఇది వాస్తవానికి చాలా దూరం, సరాసరిన నెలకు సుమారు రూ.60 వేలు మాత్రమే ఆదాయం వస్తుంది అని మరొకరంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్టు, దానికి వెంటనే రియాక్ట్ అవుతూ వచ్చిన మరో పోస్టు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.. ఈ డిబేట్ పై సోషల్ మీడియాలో చిన్న సైజు ఫైటు జరుగుందని చెప్పుకోవచ్చు!

అవును... ఓ మహిళా ‘ఎక్స్’ యూజర్ తన పోస్టులో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా... తాను ఇంటికి దగ్గరలో ఉన్న ఓ డ్రై క్లీనింగ్ షాప్ కి వెళ్లానని.. అక్కడ అతను, తన భార్య కలిసి పని చేస్తున్నారని.. వారితో పాటు మరో ఇద్దరు జీతానికి వర్క్ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ షాప్ యజమాని ఆదాయం విని తాను షాక్ తిన్నానని.. అది నెలకు రూ.2 లక్షలని.. 10ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీతంతో ఇది సమానమని అన్నారు.

ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివారాలను వెళ్లడించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... 350 బట్టలకు, ఒక్కో దానికి రూ.10 చొప్పున రోజుకు రూ.3,500 వస్తుంటే... సూట్ లు, ప్రీమియం చీరలు వంటి వాటి డ్రై క్లీనింగ్ తో పాటు ఇస్త్రీకి కలిపి రూ.350 అనుకుంటే.. అవి ఒక 20 చేస్తే.. వాటి నుంచి రోజుకి రూ.7,000 ఆదాయం వస్తుందని అన్నారు. ఈ క్రమంలో నెలలో వారు 3 రోజులు వీక్లీ హాఫ్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా లెక్కేస్తే... 23 రోజులకు, రోజుకి రూ.10,500 (రూ.3,500 + రూ.7,000) చొప్పున మొత్తం వారి నెల సంపాదన రూ.2,83,500 అని... ఇందులో వారిది సొంత షాపు అవ్వడం వల్ల రెంటు లేదు కానీ... కరెంట్ బిల్లు రూ.6,000.. ఇద్దరు స్టాఫ్ కి కలిపి రూ.40,000 తీసేస్తే... వారి ఆదాయం రూ.2,37,500 అని తెలిపారు. అయితే.. లాస్ట్ మంత్ అలా వచ్చింది కానీ... సగటున నెలకు రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తుందని వారు వెళ్లడించినట్లు రాసుకొచ్చారు.

దీంతో... ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. అదంతా ఫేక్ అని.. సత్యదూరమని చెబుతూ మరో పోస్ట్ దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా... తాను తన ఇంటిదగ్గర ఇలాంటి దుకాణం నడుపుతున్న భయ్యాతో మాట్లాడితే.. ఆ వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదని.. రూ.2.37 లక్షల ఆదాయం అంతా ఫేక్ అని చెప్పారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా... నెలకు వారి ఆదాయం రూ.60,000 అని అన్నారు!

ఈ సందర్బంగా స్పందిస్తూ... రోజుకి రూ.10 చొప్పున 350 దుస్తులకు ఇస్త్రీ... రూ.350 చొప్పున 20 ప్రీమియం దుస్తులకు డ్రై క్లీనింగ్ తో పాటు ఇస్త్రీ వాస్తవమే అయినప్పటికీ... ఇందులో వారికి సున్నా రెంటు, రూ.6 వేలు కరెంట్ బిల్లు పక్కనపెడితే... కెమికల్ ఖర్చులే నెలకు రూ.30 నుంచి రూ.50 వేల వరకూ అవుతాయని.. బాయిలర్ యంత్రాలకు నెలకు రూ.5 నుంచి 10 వేలు.. వాటి మెయింటినెన్స్ కు రూ.10 వేలు.. ఇతర ఖర్చులకు రూ.5 వేల వరకూ అవుతుందని రాసుకొచ్చారు.

ఇవన్నీ కలిసి మరో రూ.60 వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని.. దీన్ని ఆ పోస్టులో విస్మరించారని.. అందువల్ల వాస్తవ ఘణన దానికి చాలా భిన్నంగా ఉందని.. అన్ని ఖర్చులూ పోనూ ఢిల్లీలో సగటు నికర లాభం రూ.60,000 ఉంటుందని.. నిజమైన మార్జిన్లు రూ.20 నుంచి 30% ఉంటాయని తెలిపారు. దీంతో... ప్రస్తుతం లాండ్రీ షాప్ యజమానుల ఆదాయంపై సోషల్ మీడియాలో పోస్టుల వార్ నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News