తెలంగాణలో మినీ పురపోరుకు నోటిఫికేషన్ !

Update: 2021-04-15 09:30 GMT
తెలంగాణ మరో ఎన్నికలకు నగారా మోగింది. మినీ పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు... జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలన , ఆ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అలాగే ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

రేపటి నంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుండటం తో , ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతోపాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్ ‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ కు, గజ్వేల్‌, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్‌, బోధన్‌, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరగబోతున్నాయి. సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఈ రోజుతో ముగియనుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.




Tags:    

Similar News