కొత్త విషయం: అంతరిక్షయానానికి ముందు అలా చేస్తారన్న శుభాంశు
అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేసిన శుభాంశు శుక్లాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.;
అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేసిన శుభాంశు శుక్లాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సామాన్యులకే కాదు.. అంతరిక్షయానానికి సంబంధించిన కాద్దిపాటి అవగాహన ఉన్నోళ్లకు సైతం తెలీని ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. మీకు భవిష్యత్తులో అంతరిక్షయానం చేయాలని డిసైడ్ అయితే.. ఆ క్రమంలో ఏం చేయాల్సి ఉంటుందో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.
అంతరిక్షయానానికి ముందు జ్ఞాన దంతాల్ని తొలగించుకోవాల్సి ఉంటుందని చెప్పిన శుభాంశు.. ‘నా అంతరిక్షయానానికి ముందు నాకున్న రెండు జ్ఞాన దంతాల్ని తొలగించుకున్నా. అత్యవసర వైదయ పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై వ్యోమగాములకు అవగాహన ఉన్నా.. వారు చేసుకోలేనిది ఏమైనా ఉందంటే దంతాలకు సంబంధించిన చికిత్స. అందుకే.. అంతరిక్షయానానికి ముందు వ్యోమగాములకు జ్ఞాన దంతాల్ని తొలగిస్తారు’’ అంటూ చెప్పారు.
అంతరిక్ష నౌకలో దంత శస్త్రచికిత్సలు చేయలేరని.. అందుకే ముందుస్తుగా వాటిని తొలగిస్తారన్నారు. దంతాల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైందని.. వ్యోమగామిగా ఎంపిక వేళలోనే.. జ్ఞాన దంతాల్ని తీసేస్తారని చెప్పారు. అందుకే.. వ్యోమగాములుగా కావాలనుకునే వారు ఇందుకు ముందుగానే ప్రిపేర్ కావాలని చెప్పారు. శుభాంశుతో పాటు గగన్ యాన్ కు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్.. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ లు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన మూడు దంతాల్ని తొలగించుకున్నట్లుగా ప్రశాంత్ నాయర్ తెలిపితే.. ప్రతాప్ ఏకంగా నాలుగు దంతాల్ని తొలగించుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా అంతరిక్ష యానానికి ముందు జ్ఞాన దంతాల్ని తీసేయటం పక్కా అన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.